కుక్క మాంసం ఆరగించడంలో దక్షిణ కొరియా పౌరులు మొదటి స్థానంలో నిలిచారు. అయితే జంతు ప్రేమికుల నుంచి వస్తోన్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని దేశంలో కుక్క మాంసం వినియోగం నిషేధిస్తూ చట్టం తీసుకొచ్చారు.దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ఈ చట్టం తీసుకురావడంతో కీలకంగా వ్యవహరించారు.దక్షిణ కొరియా పార్లమెంటులో ఇవాళ జరిగిన ఓటింగ్లో కుక్క మాంసం వినియోగ నిషేధ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించారు. మొత్తం 208 మంది బిల్లును సమర్థించారు. ఇద్దరు సభ్యులు సభకు గైర్హాజరయ్యారు.
కొత్త చట్టం అమల్లోకి రావడంతో దక్షిణ కొరియాలో కుక్కలను మాంసం (southkorea passes bill to ban sale of dog meat) కోసం పెంచడం, వాటిని వధించడం, తినడం నిషేధించినట్లైంది. చట్టం అమల్లోకి వచ్చిన తరవాత కుక్కను చంపితే గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష లేదా రూ.19 లక్షల జరిమానా విధిస్తారు. మాంసం కోసం కుక్కలను పెంచితే రెండు సంవత్సరాలు జైలు లేదా రూ.12 లక్షల జరిమానా విధిస్తారు.
2027 నుంచి చట్టం అమల్లోకి వస్తుంది. కుక్క మాంసం వ్యాపారంలో ఉన్న వారు వారి వృత్తులను మార్చుకునేందుకు 3 సంవత్సరాల సమయం ఇచ్చారు. ఈ వృత్తిని వదిలి వేరే వ్యాపారాలు చేపట్టే వారికి ప్రభుత్వం సహాయం చేస్తుంది. కుక్క మాంసం తినడాన్ని నిషేధిస్తానని గత ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు యూన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక చెప్పిన హామీ నెరవేర్చుకున్నారు.
కుక్క మాంసం అధికంగా తినే దేశాల్లో దక్షిణ కొరియా ఒకటి. దేశంలో కుక్క మాంసం విక్రయించే రెస్టారెంట్లు 1600 పైగా ఉన్నాయి. 1150 కుక్కల ఫామ్లు ఉన్నాయి. కుక్కలను చంపితినడంపై అంతర్జాతీయంగా అనేక దేశాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో దక్షిణ కొరియా ఈ నిర్ణయం తీసుకుంది.