ఐదు దశాబ్దాల తరవాత చంద్రుడిపై ప్రయోగాలకు అమెరికా ప్రయోగించిన వ్యోమనౌక విఫలమైనట్లు వార్తలొస్తున్నాయి. వ్యోమనౌకను(peregrine mission abandons moon landing attempt) చంద్రుడిపై నిర్దేశించుకున్న ప్రాంతంలో దింపాలని చేసిన ప్రయత్నాలను విరమించుకుంటున్నట్లు పెరిగ్రిన్ను అభివృద్ధి చేసిన ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీ సోమవారం ప్రకటించింది. మిషన్ లక్ష్యాలను పున:సమీక్షించే పనిలో పడ్డారు.
ఇంధనం లీక్ వల్ల వ్యోమనౌకలోని ప్రొపెల్లెంట్ విఫలమైందని ప్రకటించారు. వుల్కన్ రాకెట్ ద్వారా ఫ్లోరిడాలోని కేప్ కెనావెరాల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి పెరిగ్రిన్ను సోమవారం నాడు నింగిలోకి ప్రయోగించారు. ప్రయోగించిన ఏడు గంటల తరవాత సమస్యను గుర్తించారు. ల్యాండర్లోని సౌర ఫలకం సూర్యుడికి అభిముఖంగా లేదని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్రొపెల్లెంట్ కోల్పోవడంతో సమస్య తలెత్తిందని, పెరిగ్రిన్ బ్యాటరీల ఛార్జింగ్ జరగడం లేదని ప్రకటించారు. దీంతో ప్రయోగం విఫలమైనట్లు ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీ తెలిపింది.