ప్రవాస
భారతీయ దివస్ సందర్భంగా విదేశాల్లో స్థిరపడిన భారతీయులకు ప్రధాని మోదీ
శుభాకాంక్షలు తెలిపారు. భారత వారసత్వాన్ని పరిపుష్టం చేయడంతో పాటు ప్రపంచదేశాలతో మనదేశ సంబంధాలు బలోపేతం చేయడంలో ముందంజలో
ఉన్నారని కొనియాడారు. అంకితభావంతో వారు ముందుకు సాగుతున్న తీరు అభినందనీయమన్నారు. భిన్నత్వంలో
ఏకత్వమనే భారతీయస్ఫూర్తిని పెంపొందిస్తున్నారని ప్రశంసించారు.
‘‘
ప్రవాస భారతీయులకు శుభాకాంక్షలు. ప్రపంచవ్యాప్తంగా ప్రవాసభారతీయులు తమ విజయాలను
జరుపుకునే రోజు. భారత వారసత్వాన్ని కాపాడటంతో పాటు ప్రపంచ సంబంధాలను మెరుగుపరుస్తున్న
తీరు ప్రశంసనీయం.’’ అని సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
‘‘
ప్రవాసభారతీయులు సాధిస్తోన్న విజయాలతో భారతదేశం మొత్తం గర్విస్తోందని’’ విదేశాంగ
శాఖ మంత్రి జైశంకర్ అన్నారు. ప్రపంచంలో భారతదేశ స్థాయిని పెంచేందుకు అందజేస్తోన్న
సహకారం అత్యుత్తమని కొనియాడారు.
సుసంపన్నమైన
సంస్కృతి, విలువలకు రాయబారులుగా ప్రపంచవ్యాప్తంగా ప్రభావాన్ని చూపిన ప్రవాస భారతీయులకు
శుభాకాంక్షలు అంటూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్ చేశారు. ప్రపంచంలో
భారతదేశ ప్రాముఖ్యత వెనుక చోదకశక్తిగా ఉన్నారని పేర్కొన్నారు.
వసుధైక
కుటుంబ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచ వ్యాప్తంగా పటిష్టం చేస్తోన్న ప్రవాసభారత
సోదరసోదరీమణులకు శుభాకాంక్షలంటూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కొనియాడారు. భారతదేశ సర్వతోముఖాభివృద్ధి
భాగస్వామ్యపాత్రను కొనసాగించాలని ఆకాంక్షించారు.
భారతదేశ
అభివృద్ధిలో ప్రవాస భారతీయుల పాత్రను గుర్తుచేసుకుంటూ ప్రతీ ఏడాది జనవరి 9న ప్రవాస భారతీయ
దివస్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 1915 లో జాతిపిత మహాత్మాగాంధీ, ఈ రోజునే
దక్షిణాఫ్రికా నుంచి భారత్ తిరిగివచ్చారు. ప్రవాస భారతీయ దివస్ వేడుకలు విదేశాంగ
ఆధ్వర్యంలో ప్రతీఏటా జరుగుతున్నాయి.