ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు, ఎంపీలు(madives india row) చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆ దేశ టూరిజం ఇండస్ట్రీ మాటీ తీవ్రంగా ఖండించింది. భారత్, మాల్దీవులకు అత్యంత సన్నిహిత దేశమని, మిత్రదేశమని మాటీ పేర్కొంది. మాల్దీవుల్లో అనేక సంక్షోభాలకు భారత్ స్పందించి ఆదుకుందని పర్యాటక సమాఖ్య అభిప్రాయపడింది.
మాల్దీవులకు భారత పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తూ సహాయపడుతున్నారని, కోవిడ్ సమయంలోనూ తమ దేశానికి భారీ సాయం చేశారని మాటీ గుర్తుచేసింది.మాల్దీవుల పర్యాటకంలో భారత్ అగ్రభాగంలో ఉందని కొనియాడారు. రెండు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు రాబోయే తరాల్లో కూడా కొనసాగాలని ఆకాంక్షించారు. భారత్‌పై ప్రతికూల ప్రభావం చూపే వ్యాఖ్యలకు దూరంగా ఉంటామని మాటీ పేర్కొంది.
ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. నూతన సంవత్సర ప్రారంభంలో జనవరి 2న ప్రధాని మోదీ లక్షద్వీప్‌లో పర్యటించారు. స్నార్కెలింగ్ చేసి, బీచ్‌లో సేదతీరుతూ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రధాని మోదీ పోస్ట్‌లపై మాల్దీవుల మంత్రులు విమర్శలు చేయడం దుమారానికి కారణమైంది.