ధనుర్మాస ప్రత్యేక కథాస్రవంతి : 23
మంచి వెన్నెల వేళ :: సింహము వలె నడచిరా! ~ కాత్యాయనీ వ్రతం – 23
రచన : ‘కొత్తావకాయ’ సుస్మిత
**************************
యమున ఒడ్డున కాత్యాయనికి పూజ చేసి, హారతులిచ్చి, కృష్ణుని
మేలుకొలిపేందుకు బయలుదేరిన గోపకాంతలు విచ్చిన పువ్వుల్లా కళకళలాడుతున్నారు.
శుకపికాలకే ముచ్చట గొలిపేలా, కిలకిలా నవ్వుతూ ఆడుతూ పాడుతూ కోలాహలంగా వెళ్తున్నారు.
“సురభీ! ఎంత హాయిగా ఉందో ఈవేళ! నీకూ అంతేనా?” అడిగింది
కమలిని.
“ఓ..!”
“ఈ రోజు కృష్ణుడు మేలుకొంటాడేమో! బయటకు
వచ్చేస్తాడేమో! శుభ సూచనలు కనపడుతున్నాయి.” నవ్వింది కమలిని.
“అప్పుడేనా! ఈ విరహాగ్ని ఎంత హాయిగా ఉందో! ఈ
ఎదురుచూపులే ఎంత బాగున్నాయో కదా!” అంది సురభి.
“అయ్యో! అలా అంటావేం చెలీ!” వారించింది తరళ.
“ఏమో! నాకు అలాగే అనిపిస్తోంది.” అడిగింది
సురభి.
“నీదే భారం, నేను నీవాడిని” అన్న విభీషణుడికే కాస్త ఎదురుచూపు తప్పలేదు.
అయితే తనని కాపాడే భారం రాముడి భుజాలపైకి నెట్టేసాక అతనికి చింత ఏల? మనమూ అంతే.”ఆనందిని
నవ్వింది.
“విభీషణుడు పిలవగానే వినలేదా రాముడు?” సందేహం
వ్యక్తపరిచింది కమలిని.
“హ్మ్.. ప్రతీ పనికీ ఒక పధ్ధతి ఉంటుంది కదా! వారధి
నిర్మించి వారాశి దాటి లంకను చేరిన రాముని శరణు కోరాలని వచ్చాడు విభీషణుడు.
“రాఘవుని శరణు కోరి వచ్చాననీ, తన వారందరినీ విడిచి వచ్చాననీ” చెప్పాడు.”
“ఊ.. “
“శత్రువు తమ్ముడు మనకు మిత్రుడెలా అవుతాడని”
రాముడిని లక్ష్మణుడు, సుగ్రీవుడు తదితరులు అడ్డుకున్నారు. వారికి నచ్చచెప్పాడు రాఘవుడు. “అభయం
సర్వభూతేభ్యో దదామ్యేతత్ వ్రతం మమ!” అని
దృఢంగా చెప్పాడు. ఆపై విభీషణుని తనవాడిని చేసుకున్నాడు. అదే పురుషోత్తముని సౌలభ్యం!”
“మరి మనమో!”
“మనమూ పద్ధతి పాటించాము. ఆచార్యుని వంటి నందగోపుని
ఆశ్రయించాం. మంత్రం వంటి యశోదని ఉపాసించాం. భాగవతుడైన బలరాముని సహకారం
తీసుకున్నాం. ఆ పై పురుషకార భూతురాలైన దేవేరి “నీల”ను ప్రసన్నురాలిని
చేసుకున్నాం. ఇక మిగిలినది మన పని కాదు.. ఆయనదే!”
“ఇంత చేసామా! ఆశ్చర్యంగా లేదూ!”
“తప్పు! మనం చెయ్యలేదు. మనకు పరోక్షంగా
దిశానిర్దేశం చేసినది కృష్ణుడే! లేకపోతే మనకిన్ని తెలివితేటలెక్కడివీ!”
“అవును,
ఆనందినీ! అయితే ఈ రోజు కృష్ణుని చూడగలమా!”
ఆశగా, సంబరంగా అడిగింది కమలిని.
“ఊ.. ఇకనో, ఇప్పుడో!” ఊరించింది ఆనందిని నవ్వుతూ!
“అవునా! నాకు ఆనందంతో ఊపిరాడడం లేదు.” ఉరకలు
వేస్తున్న సంబరం అందరి ముఖాలలో.
“కృష్ణుడిని సింహగతితో నడిచి రమ్మని కోరుదాం.” చెప్పింది ఆనందిని.
“సింహగతా? ఏమిటది?”
“వానకారులో వేట మాని గుహలో నిద్దురపోతున్న మృగరాజు
ఎలా నిద్ర లేస్తాడో, అలా లేచి రమ్మందాం. అదిగో వచ్చేసాం. పదండి..” మందిరపు మునివాకిట
నిలిచారందరూ.
“కృష్ణా! నువ్వు రావణుడనే గంధగజం పాలిటి రాఘవ సింహానివి. ప్రహ్లాదుని
కాచిన నృహరివి! వర్షాకాలంలో కొండగుహలో నిదురిస్తున్న సింహం వలె యోగ నిద్రలో
ఉన్నావు. సృష్టి చింతనలో ఉన్నావేమో! మా మొరాలించి ఇకనో, ఇప్పుడో నిద్రలేచి
వస్తావు. మాకు అది తెలుసు. తెలివి రాగానే టక్కున పైకి లేచి, చరచరా నడిచి, తటాలున తలుపుతెరచి
వచ్చేస్తావేమో! నువ్వలా రావద్దు. మాదొక కోరిక తీర్చాలి నువ్వు. నీ రాకలో
సౌందర్యాన్ని తేరిపారా చూసి మా కనులు ధన్యమవ్వాలి.” చెప్పింది ఆనందిని.
“ఎలా రమ్మంటావు కన్నయ్యని? అదీ చెప్పు
సఖీ!” ప్రశ్నించారు మిగిలిన వారు కుతూహలంగా.
“కృష్ణా! సింహసంహననుడివి! నీ సర్వాంగ సౌందర్యాన్ని మేము ఆస్వాదించాలంటే, నువ్వు గబగబా నడిచి
వచ్చేస్తే కుదరదు. ఇన్ని రోజుల మా ఎదురుచూపులు పండేలా, మా ఎడదలు నిండేలా
నడిచి రా! “అయ్యో వెర్రి గొల్లెతలు, ఎదురుచూస్తున్నారే!” అని తొందరపడి
అశ్వగతిలోనో, ఏ వృషభ గతిలోనో.. లేదా మరీ నిదానంగా గజగమనంలోనో రాకు. నువ్వు
సింహగతిలో రావాలి. సింహంలా నడిచి రమ్మన్నాం కదా! అని లేచి వచ్చేస్తావేమో! విను..
నువ్వెలా నిద్రలేవాలో చెప్తాం. అలాగే మేలుకొని రావాలి. తెలిసిందా!
ఒకే చోట ఉన్న ప్రేమికులకు వర్ష ఋతువు ఎంత
ఆహ్లాదకరమైనదో, విరహతాపంలో ఉన్నవారికి అంత దుస్సహం! ‘వర్షాకాలం
యుధ్ధానికి అనుకూలం కాదన్న‘ సుగ్రీవుని మాట విని, మాల్యవత్పర్వతంపై కొండ గుహలో విడిది చేసి ఉన్న సమయంలో… సాక్షాత్తూ
రామచంద్రుడే విరహి అయి, సీతావియోగాన్ని తాళలేక లక్ష్మణునితో చెప్పుకుని బాధపడ్డాడట! విరహోత్కంఠితలమై
ఉన్నాము. ఎదురుచూపులనే వానకారు గడిచిందనే అనుకుంటున్నాం. మా విరహం
తుదికొచ్చేసిందని మాకు తెలుస్తోంది. నీ దర్శనమింక ఈయక నీకూ తప్పదు, కన్నా!
గుహలో సింహంలా.. నిద్రలే! నీ ఎర్రని
కన్నులను నెమ్మదిగా అరవిచ్చి చూడు. సింహం బద్ధకంతో పొర్లినట్టు నీ సుఖశయ్యపై అటూ
ఇటూ పొర్లు! పైకి నెమ్మదిగా లే! మృగేంద్రుడు జూలు విదిల్చినట్టు నీ నీలాల కురులు
విదల్చు. ఎందుకో తెలుసా! నీ చుట్టూ రకరకాల పరిమళాలున్నాయి. నీల మందిరంలో అగరుధూపం, చందన సుగంధం, అత్తరు, పన్నీటి వాసనలూ..
ఇవన్నీ కాక ‘అరవింద గంధి‘ నీల ఒంటి సువాసన నిన్ను పట్టి ఉంటుంది. మాకవేవీ అక్కర్లేదు. నీ కురుల సహజ
పరిమళం ఆఘ్రాణించాలి. “సర్వగంధః సర్వరసః” అని
నిన్ను పొగుడుతారే! అన్ని తావులూ నీలో నింపుకున్న వాడివి. నీ పరిమళం మాకు కావాలి.
కురులు విదల్చు! ఆ పరిమళం తావిమోపరి మా దాకా మోసుకొస్తాడు. మేము మా గుండెల నిండా ఆ
పరిమళం పీల్చుకుని మైమరచిపోవాలి.
అంతేనా! సింహం గుహలోనుండి బయటకు
వచ్చినట్టు.. గంభీరంగా, అందంగా, హుందాగా నడిచిరా! మా కనురెప్పలు వెయ్యకుండా నీ నడక చూడాలి. శౌర్యాన్ని
నింపుకున్న నీ కదలికలు చూడాలి. మగసిరి ఉట్టిపడే నీ ఆకృతిని చూడాలి. అలా
బయటకు వచ్చి నిలబడిన నీ ‘అవిసె పువ్వు‘లాంటి మేనిఛాయ చూసి మురిసిపోతాం. ఎంత అందమైన వర్ణం నీది!! కాఠిన్యం
ఇంచుకైనా లేని సుతిమెత్తని అతసీపుష్పాన్ని పోలిన నీ మేని కాంతులను చూడాలి. “అతసీ
పుష్పసంకాశం హారనూపుర శోభితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం!” కృష్ణా!
యదుమోహనా! నీ మెడలో హారాలు, నీ చేతుల రత్నకంకణాల శింజితాలు మేము వినాలి. అలా వచ్చి అదిగో అక్కడ
నీకో “మేటి రతనాలు పొదిగిన కనక రుచిర సింహాసనం” ఉంది. దానిపై కూర్చో!
అది ధర్మపీఠం. అక్కడ కూర్చుని మా కోరికలు వింటే నువ్వు కాదనవు.మేమొచ్చిన
పని పూర్తవుతుంది. కృష్ణా! విన్నావా! అలా మేలుకో! అలా నడిచి రా!”
తరలి రాగదే, దేవ! దయచేయగదే!
దరిసింపగవచ్చిన
మా పని విని పాలింతుగాని! తరలి రాగదే!
వానకారులోన సింహమొకడు మేల్కాంచి, పొడవు
మేను
సారించి, ధూళి తూలించి, కెంపు కనుల
మానుగ
వీక్షించి, పరీమళభర సటలుగ, గహ్వ
రాన
వెలువడు చందాన మందిరమునుండి, తరలి రాగదే!
భాసుర బహురత్న ఘటిత భర్మ సిం హ పీఠికా
ధ్యాసివై, అనుగ్రహోల్లాసివైన
స్వామీ! అత
సీసుమ
కోమల శ్యామమోహను, లోకావను, నిను
చూసి
చూసి, మనసు వెళ్ళబోసి, కృతార్థులము
కాగ – తరలిరాగదే!
“కృష్ణా! వింటున్నావు కదా! ఇవన్నీ మనసులో పెట్టుకో. రేపటి తెలవారు
ఝామున వస్తాం! మా కోరిక తీరేలా దర్శనమివ్వు!” అని మళ్ళీ మళ్ళీ చెప్పి మరీ
వెనుతిరిగారు గోపకాంతలు. ఇంకా శయనించే ఉన్న మాధవుని పెదవులపై లేనగవొకటి మెరిసింది.
(ఎందుకో మరి! రేపు చూద్దాం!)
(ఆండాళ్ “తిరుప్పావై” పాశురాలకు, దేవులపల్లి
కృష్ణశాస్త్రి గారి తేనె తీయని తెనుగు సేత)
(ఆండాళ్ “తిరుప్పావై”, బమ్మెర పోతనామాత్య
ప్రణీత “శ్రీమదాంధ్ర భాగవతము”, పిలకా గణపతి శాస్త్రి గారి “హరి వంశము”
ఆధారంగా.. తగుమాత్రం కల్పన జోడించి..)