Indian celebrities slam
Maldives, love Lakshadweep
లక్షద్వీప్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ
పర్యటించిన తర్వాత, మాల్దీవ్స్ దేశ మంత్రులు మోదీపైనా భారతదేశంపైనా అభ్యంతరకర
వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా అందరి దృష్టీ లక్షద్వీప్ మీద పడింది. మన దేశానికి
చెందిన ప్రముఖ క్రీడాకారులు, సినీనటులు ఈ విషయంలో ఘాటుగా స్పందించారు. మాల్దీవుల
మంత్రుల వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. లక్షద్వీప్‌ను సందర్శించాలన్న ఆసక్తి వ్యక్తం
చేస్తున్నారు. భారత్‌లో బీచ్ టూరిజంకు ప్రాచుర్యం కల్పించడానికి
ముందుకొస్తున్నారు.
‘‘మాల్దీవ్స్‌కు చెందిన ప్రముఖ వ్యక్తులు
భారతీయులపై ద్వేషపూరిత జాత్యహంకార వ్యాఖ్యలు చేయడాన్ని చూసాను. టూరిజంపైనే ఆధారపడిన
ఆ దేశం, తమకు ఎక్కువమంది పర్యాటకులను పంపిస్తున్న (భారత)దేశాన్నే ఇలా అవమానించడం
ఆశ్చర్యంగా ఉంది. మనం మన పొరుగువారితో ఎప్పుడూ మంచిగానే ఉంటాం. కానీ ఇలాంటి అసందర్భ
విద్వేషాన్ని ఎందుకు సహించాలి? నేను చాలాసార్లు మాల్దీవ్స్ వెళ్ళాను, ఆ దేశాన్ని మెచ్చుకున్నాను.
కానీ మన ఆత్మగౌరవమే ప్రధానం. మనం మన దేశంలోని దీవులను చూద్దాం, మన దేశీయ పర్యాటకానికి
మద్దతిద్దాం’’ అని అక్షయ్ కుమార్ వ్యాఖ్యానించాడు. (Akshay Kumar)
‘‘అందమైన, పరిశుభ్రమైన, అద్భుతమైన
లక్షద్వీప్ బీచ్‌లో మన ప్రధానమంత్రి నరేంద్రమోదీని చూడడం చాలా బాగుంది. గొప్ప
విషయం ఏంటంటే, ఆ బీచ్ మన సొంత దేశంలోనే ఉంది’’ అని సల్మాన్ ఖాన్ ట్వీట్ చేసాడు. (Salman Khan)
బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ భామ కంగనా రనౌత్ (Kangana Ranaut) అయితే, మాల్దీవ్స్ ఎంపీ జాహిద్ రమీజ్ చేసిన వ్యాఖ్యల మీద
విరుచుకుపడింది. ‘‘కంపు కొడుతున్నాయా? ఆ కంపు ఎప్పటికీ వదలదా? నువ్వు స్వయంగా ఒక
ముస్లింవి అయి ఉండి ముస్లిం ఫోబియాతో భయపడుతున్నావు. లక్షద్వీప్‌లో 98శాతం జనాభా
ముస్లిములే. ఈ మాల్దీవ్స్ ఎంపీ మన లక్షద్వీప్ జనాలను కంపు కొట్టేవారు అనడం
కచ్చితంగా జాత్యహంకారమే. పైగా అతనికి ఇక్కడి ప్రజల గురించి ఏమీ తెలీదు. లక్షద్వీప్
మొత్తం జనాభా 60వేల లోపే. అది ఇప్పటివరకూ ఎవరూ పెద్దగా వెళ్ళని, గమనించని, పాడుచేయని
అందమైన సహజమైన ద్వీపం. నిజానికి చాలామందికి పర్యాటకం అంటే ఒక జల్సా మాత్రమే కాదు.
పర్యాటకం అనేది ప్రకృతిని ఆస్వాదించడం, ఎవరూ పాడుచేయని అద్భుతమైన ప్రకృతి అందాలను
అనుభూతి చెందడం. ఇలాంటి జాత్యహంకార వ్యాఖ్యలు చేయడానికి సిగ్గుండాలి’’ అంటూ కడిగి పడేసింది.
భారతదేశం మీద, భారత ప్రధాని మీద జాత్యహంకార
వ్యాఖ్యలు చేసిన మాల్దీవ్స్ మంత్రి మరియం షియునా మీద మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ (Venkatesh Prasad) విరుచుకుపడ్డాడు. ‘‘ఒక దేశపు మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మా దేశం
గురించి ఎలా మాట్లాడుతోందో. మాల్దీవ్స్ ఒక పేద దేశం. పర్యాటకం మీదే ఆధారపడి ఉన్న
దేశం. ఆ దేశ పర్యాటకుల్లో 15శాతం మంది భారతీయులే. భారతదేశంలో ఎన్నో అందమైన
తీరప్రాంత పట్టణాలు ఉన్నాయి. వాటిని ఇన్నాళ్ళూ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.
వాటిని పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసుకోడానికి ఇదో గొప్ప అవకాశం’’ అని
వ్యాఖ్యానించాడు.
నటుడు జాన్ అబ్రహాం (John Abraham) లక్షద్వీప్ సౌందర్యాన్ని ప్రశంసల్లో ముంచెత్తాడు. ‘‘అతిథిదేవోభవ – అతిథులను
గౌరవించాలి అన్నది భారతీయుల సంప్రదాయం. భారతీయుల ఆతిథ్యం అద్భుతం. ఇక లక్షద్వీప్‌లో
అంతులేని సాగర సౌందర్యాన్ని ఎంత చూసినా తనివితీరదు. అక్కడకు వెళ్ళి తీరాల్సిందే’’
అని ట్వీట్ చేసాడు.
క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) మహారాష్ట్రలోని సింధుదుర్గ్ ఉదాహరణతో భారతదేశంలోని అద్భుతమైన సముద్రతీర
ప్రాంతాల గురించి వివరించాడు. ‘‘నా 50వ పుట్టినరోజు జరుపుకోడానికి 250 రోజుల క్రితం
సింధుదుర్గ్ వెళ్ళాము. మేము ఆశించినదానికంటె ఎంతో ఎక్కువ ఆనందించగలిగాం.
అద్భుతమైన ప్రదేశాలు, అంతకంటె గొప్ప ఆతిథ్యం మాకు ఎన్నో అమూల్యమైన జ్ఞాపకాలను
మిగిల్చాయి. ‘అతిథిదేవోభవ’ అన్నది మన భారతీయుల తత్వం. మనదేశంలో ఎన్నో గొప్ప అందమైన
ప్రదేశాలున్నాయి, వాటిని చూసి ఆ అందమైన జ్ఞాపకాలను మూటకట్టుకోవాలి’’ అంటూ
రాసుకొచ్చాడు.
సినీదర్శకుడు మధుర్ భండార్కర్ (Madhur Bhandarkar), ప్రధాని లక్షద్వీప్ పర్యటనపై ప్రశంసల జల్లు కురిపించాడు.
‘‘ప్రధానమంత్రి ఇటీవలి పర్యటన ద్వారా తెలుసుకున్న లక్షద్వీప్ అద్భుతమైన సౌందర్యం
నన్ను మంత్రముగ్ధుణ్ణి చేసింది. ఇన్నాళ్ళూ దాగివున్న ఈ ఆణిముత్యాన్ని త్వరలోనే
సందర్శిస్తాను’’ అని మధుర్ ట్వీట్ చేసాడు.
మాల్దీవ్స్ రాజకీయ నాయకుల అనుచిత
వ్యాఖ్యలు భారత్‌కు మేలే చేసాయని క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ (Veerendra Sehwag) అభిప్రాయపడ్డాడు. దేశంలోని గొప్పగొప్ప పర్యాటక ప్రదేశాలను వదిలి
విదేశాలకు పరుగులు పెట్టడం ఆపాలని భావించాడు. ‘‘అందమైన ఉడుపి బీచ్‌లు, పాండిలోని
పారడైజ్ బీచ్, అండమాన్‌లోని నీల్ అండ్ హేవలాక్ బీచ్…. ఇలా భారతదేశం అంతటా ఎన్నో
అందమైన తీరప్రదేశాలున్నాయి. పర్యాటకులు పెద్దగా చూడని ప్రదేశాలు భారతదేశంలో చాలానే
ఉన్నాయి. అలాంటి చోట్ల కనీస మౌలిక సదుపాయాలు కల్పిస్తే చాలు, ఆ ప్రదేశాలు పర్యాటకులను
అమితంగా ఆకట్టుకోగలవు. ప్రతీ సమస్యనూ అవకాశంగా మలచుకోగల భారతదేశపు శక్తి ప్రపంచం
అంతటికీ తెలుసు. మాల్దీవ్స్ మంత్రులు మా దేశం గురించి, మా ప్రధాని గురించీ చులకనగా
మాట్లాడడం భారత్‌కు గొప్ప అవకాశంగా మారింది. అక్కడ మౌలిక వసతులు కల్పిస్తే చాలు పర్యాటకులకు
గొప్ప అనుభూతి కలుగుతుంది. ఇంకా దేశ ఆర్థిక స్థితిగతులను మెరుగు పరుస్తుంది’’ అని
వీరేంద్ర సెహ్వాగ్ ఎక్స్‌లో ట్వీట్ చేసాడు.
సెహ్వాగ్ ట్వీట్‌కు బిగ్ బీ అమితాబ్
బచ్చన్ (Amitabh Bachchan) స్పందించాడు. ‘‘వీరూ…. నీ వ్యాఖ్య సందర్భోచితంగా ఉంది. మన దేశం
గురించి సరైన దిశలో ఆలోచింపజేసేలా ఉంది. పర్యాటకపరంగా మన దేశం చాలా గొప్పది. నేను
లక్షద్వీప్, అండమాన్స్ దీవులను సందర్శించాను. అవి అత్యద్భుతమైన సౌందర్యంతో
విరాజిల్లే గొప్ప ప్రదేశాలు. అక్కడి బీచ్‌లు చూస్తే మతి పోతుంది. అక్కడ సముద్రం
అడుక్కి వెళ్ళడం గొప్ప అనుభవం…. అసలు నమ్మనేలేము. మనం భారతీయులం, మన స్వయంసమృద్ధి
చాలా గొప్పది, దాన్ని ఎవరూ ప్రశ్నించలేరు. జైహింద్’’ అంటూ అమితాబ్ బచ్చన్ తన
అనుభవాలను గుర్తు చేసుకున్నాడు.
లక్షద్వీప్ అందాలకు పోటీయే లేదని నటి
శిల్పాశెట్టి అంది. ‘‘నా ప్రయాణాల ప్రణాళికలో ఇప్పుడు లక్షద్వీప్ సౌందర్యాన్ని
చూడడానికే మొదటి ప్రాధాన్యం. తేటతెల్లంగా ఉండే సాగరజలాలు, ప్రశాంతతకు నిలయంగా ఉండే
సముద్రతీరాలూ చూసి తీరాల్సిందే. ఆ పర్యటన
మరచిపోలేని అద్భుతమైన అనుభూతిగా మిగలడం ఖాయం’’ అని శిల్పాశెట్టి (Shilpa Shetty) అంచనా వేసింది.
నటి శ్రద్ధాకపూర్ (Shraddha Kapoor) కూడా లక్షద్వీప్‌లోని స్వచ్ఛమైన తీరప్రాంతాలను చూడాలన్న ఆకాంక్ష వ్యక్తం
చేసింది. ‘‘లక్షద్వీప్ గురించి వస్తున్న చిత్రాలు, మీమ్స్ చూస్తూ
ఉండలేకపోతున్నాను. ఎంత స్వచ్ఛమైన బీచ్‌లు, తీరప్రాంతాలు. అక్కడి స్థానిక
సంస్కృతిని చూడడానికి ఆగలేకపోతున్నాను. ఇప్పటికిప్పుడు సెలవు పెట్టేసి వెళ్ళిపోవాలని
ఉంది. ఈ సంవత్సరం భారతదేశంలోని ద్వీపాలను సందర్శిద్దాం’’ అని ట్వీట్ చేసింది.
మరో నటి జాక్వెలెన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez) కూడా అదే ఆలోచనలో ఉంది. ‘‘2024లో ఇంటికి దగ్గరగా (దేశంలో) ఉన్న
అందమైన, ప్రకృతిరమణీయమైన ప్రదేశాలను సందర్శించాలి. ఈ యేడాది నేను చూడాల్సిన అలాంటి
ప్రదేశాల జాబితాలో మొట్టమొదటిది లక్షద్వీప్. అది ఈ భూమిమీద స్వర్గంలా ఉంది. ఆ
అద్భుతమైన చోటు గురించి ఎంత విన్నానంటే ఇంక నేను ఆగలేను’’ అని రాసుకొచ్చింది.
లక్షద్వీప్ అభిమానుల జాబితాలో ప్రముఖ
పారిశ్రామికవేత్త, సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పునావాలా (Adar Poonawalla) కూడా చేరిపోయాడు. ‘‘మన దేశంలో ఎన్నో అద్భుతమైన పర్యాటక
ప్రదేశాలున్నాయి. వాటి పర్యాటక సామర్థ్యాన్ని ఇప్పటివరకూ అంచనాయే వేయలేదు. వాటిని
పూర్తిగా కనుగొనలేదు. నేను ఇక్కడ పోస్ట్ చేసిన చిత్రాలు భారతదేశంలోని అద్భుతమైన
పర్యాటక ప్రదేశానివి అని ఊహించగలరా’’ అంటూ నరేంద్ర మోదీ లక్షద్వీప్ చిత్రాలను
ట్వీట్ చేసాడు.
‘‘ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్షద్వీప్‌లో
బీచ్‌లో ఉన్న ఫొటోలు చూస్తుంటే ఆ స్వచ్ఛమైన సాగర జలాలను, ప్రశాంతమైన బీచ్లనూ
నేనెంత మిస్ అయిపోయానో తెలుస్తోంది. నా తర్వాతి హాలిడే బుక్ చేసుకోడానికి
ఇంకెంతమాత్రం ఆగలేను’’ అని నటుడు వరుణ్ ధావన్ (Varun Dhawan) ట్వీట్ చేసాడు.
మరో యువనటుడు టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) కూడా భారతీయ ద్వీపాల అందం గురించి రాసుకొచ్చాడు. ‘‘ఆ నీలివర్ణపు
కౌగిలిలో నన్ను నేను మరచిపోతాను. గొప్ప సంస్కృతి, ప్రశాంతమైన సాగరతీరం, అక్కడి
ప్రజల సహజమైన ఆత్మీయత నా హృదయాన్ని చూరగొన్నాయి. ఆ దీవుల అసాధారణమైన సౌందర్యాన్ని
అనుభూతి చెందడంలో నాతో కలిసిరండి. ఓ అద్భుతమైన నిధి మనకోసం ఎదురుచూస్తోంది’’ అని
వర్ణించాడు.
అందాల నటి పూజా హెగ్డే (Pooja Hegde) కూడా లక్షద్వీప్ సౌందర్య సంస్కృతిని ఆస్వాదించడానికి సిద్ధంగా
ఉన్నానంటూ ట్వీట్ చేసింది. కళ్ళను కట్టివేయడం మాత్రమే కాదు, హృదయాన్ని సైతం
పులకరింపజేసే గొప్ప అందమది… అంటూ ప్రశంసించింది.
ప్రధాని నరేంద్రమోదీ రాసిన నాలుగు వాక్యాలు, పంచుకున్న గుప్పెడు ఫొటోలు… భారత పర్యాటకానికి, ప్రత్యేకించి లక్షద్వీప్ టూరిజానికి
ఎంత మేలు చేసాయో దీన్నిబట్టే తెలుస్తుంది.