ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి (pm narendra modi) పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫోన్ చేసినా, అందుకు నిరాకరించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. 2019లో భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ పాకిస్థాన్‌కు దొరికిపోయారు. అక్కడి సైన్యం అభినందన్‌ను చిత్రహింసలకు గురిచేసింది. రెండు దేశాల మధ్య ఆ సంఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఆ సమయంలో అప్పటి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, మోదీకి ఫోన్ చేశారట. అయితే ఇమ్రాన్ ఖాన్‌తో మాట్లాడేందుకు ప్రధాని మోదీ సుముఖత చూపలేదని, మాజీ హై కమిషనర్ అజయ్ బిసారియా తన పుస్తకంలో వెల్లడించారు.
భారత్, పాక్ దేశాల మధ్య దౌత్య సంబంధాలపై అజయ్ రాసిన పుస్తకం త్వరలో విడుదల కానుంది. పుల్వామాలో సైనికులపై జరిగిన దాడి తరవాత రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, పాక్ ఎలా భయపడింది? ఉగ్రవాదంపై పాక్ తన విధానాలను మార్చుకున్న తీరు, వంటి అంశాలను పుస్తకంలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
2019 ఫిబ్రవరి 27న అభినందన్‌ను పాక్ సైనికులు బంధించిన తరవాత భారత్ తీవ్రంగా స్పందించింది. పాక్‌పైకి క్షిపణులతో దాడికి సిద్దమైంది. విషయం తెలియడంతో పాక్ భయపడింది.ఆ సమయంలో అప్పటి పాక్ హైకమిషనర్ సోహైల్ మహమ్మద్ ఇస్తామాబాద్‌లో ఉన్నారు. అర్థరాత్రి తనను సంప్రదించినట్లు అజయ్ తెలిపారు. ప్రధానితో ఇమ్రాన్ ఖాన్, ఫోన్లో మాట్లాడాలనుకుంటున్నట్లు కోరిన విషయం వెల్లడించారు. అందుకు ప్రధాని మోదీ నిరాకరించడంతో వారు మిన్నకుండిపోయారని అజయ్ తెలిపారు.
భారత కమాండర్ అభినందన్‌ను విడిపించుకునేందుకు భారత్ క్షిపణులతో సిద్దమైనట్లు ఎక్కడా అధికారిక ప్రకటన విడుదల కాలేదు. అయినా ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం భయపడిందని అజయ్ తన పుస్తకంలో చెప్పుకొచ్చారు. 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ… అభినందన్‌ను విదిలిపెట్టి పాక్ మంచి పని చేసింది. లేదంటే కాళరాత్రి చూడాల్సి వచ్చేదని ప్రధాని మోదీ చేసి వ్యాఖ్యలను అజయ్ గుర్తు చేశారు.
2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో సైనిక కాన్వావ్పై ఉగ్రదాడి జరిగింది. దీనికి ప్రతిగా భారత్ పాక్‌లోని బాలాకోట్ ఉగ్ర శిబిరాలపై సర్జికల్ స్ట్రయిక్ చేసింది. ఫిబ్రవరి 27న పాక్ వైమానికదళానికి చెందిన ఎఫ్ 16 విమానం భారత్‌పై దాడికి ప్రయత్నించింది. వింగ్ కమాండర్ అభినందన్ మిగ్ 21 విమానంతో దాన్ని నేలకూల్చారు. ఈ క్రమంలో మన విమానం కూడా కూలిపోయింది. పారాచూట్ సహాయంతో అభినందన్ నేలకు దిగారు. పాక్ సైనికులు అభినందన్‌ను అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడి తీసుకురావడంతో అభినందన్‌ను పాక్ వాఘా సరిహద్దు భారత్‌కు అప్పగించింది.