జాబిల్లిపై ప్రయోగాలకు అగ్రరాజ్యం అమెరికా సిద్దం అవుతోంది. 50 సంవత్సరాల కిందటే చంద్రుడిపై అమెరికా శాస్త్రవేత్తలు కాలుమోపారు. ఆ తరవాత చంద్రుడిపై ప్రయోగాలకు అమెరికా అంతగా ఆసక్తి చూపలేదు. అయితే ఇటీవల భారత్ చంద్రయాన్ 3 మిషన్ విజయవంతం కావడంతో అగ్రరాజ్యాలు మరోసారి జాబిల్లిపై ప్రయోగాలకు సిద్దం అవుతున్నాయి. 2024 డిసెంబరులో నాసా ఆర్టెమిస్ 2 (nasa artemis 2) ప్రయోగం చేసేందుకు రంగం సిద్దం చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా లూనార్ ల్యాండర్‌ను ప్రయోగించింది. అమెరికాకు చెందిన ఓ ప్రైవేటు కంపెనీ ఈ ల్యాండర్‌ను తయారు చేసినట్లు తెలుస్తోంది.
పెరిగ్రీన్ ల్యాండర్‌ను ఇవాళ విజయవంతంగా ప్రయోగించారు. నాసా అంతరిక్ష కేంద్రం నుంచి వల్కన్ రాకెట్ పెరిగ్రీన్ ల్యాండర్‌ను విజయవంతంగా మోసుకెళ్లింది. అది ఫిబ్రవరి 23న చంద్రుడి ఉపరితంలపై దిగనుంది. అంతరిక్ష ప్రయోగాల్లో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించేందుకు నాసా కీలక అడుగులు వేస్తోంది.
1969లో అమెరికా అపోలో 11 రాకెట్ ద్వారా నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, బుజ్ ఆల్ట్రిన్, మైఖేల్ కాలిన్స్ అనే శాస్త్రవేత్తలు చంద్రుడిపై అడుగుపెట్టారు. ఆ తరవాత నాలుగేళ్లపాటు అనేక ల్యాండర్లను అమెరికా ప్రయోగించింది. 2024 డిసెంబరులో ఆర్టెమిస్ 2 ద్వారా నాలుగురు వ్యోమగాములను చంద్రుడిపైకి పంపించడానికి అమెరికా సన్నాహాలు చేస్తోంది.