Maldives trying to set
right equations with India
భారతదేశంపైనా, ప్రధానమంత్రి
నరేంద్రమోదీపైనా మాల్దీవ్స్ మంత్రులు చేసిన వ్యాఖ్యలు బెడిసికొట్టాయి. దాంతో మాల్దీవ్స్
ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది.
భారత్‌లో మాల్దీవుల రాయబారి ఇబ్రహీం
షబీబ్ ఈ ఉధయం ఢిల్లీ సౌత్‌బ్లాక్‌లోని విదేశీ వ్యవహారాల శాఖ కార్యాలయానికి వెళ్ళారు.
భారత ప్రభుత్వం జారీ చేసిన సమన్లకు స్పందనగానే మాల్దీవుల రాయబారి విదేశాంగశాఖ
కార్యాలయానికి వెళ్ళినట్లు తెలుస్తోంది. తమ దేశపు ప్రభుత్వంలోని మంత్రులు భారతదేశం
మీదా, భారత ప్రధాని మీదా చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలోనే షబీబ్కు సమన్లు జారీచేసారని
అనధికారిక సమాచారం.
అదే సమయంలో, మాలేలో భారత హైకమిషనర్ ఇవాళ
మాల్దీవ్స్ ప్రతినిధితో సమావేశమయ్యారు. భారత హైకమిషనర్ మును మహావర్, మాల్దీవ్స్ విదేశాంగ
శాఖ రాయబారి అలీ నసీర్ మహమ్మద్ సమావేశం ముందుగానే నిర్దిష్టమైన ఎజెండాతో
నిర్ణయించినదే. మును మహావర్ ఈ సమావేశంలో నసీర్ మహమ్మద్‌తో ద్వైపాక్షిక అంశాలను
చర్చించారని భారత హైకమిషన్ ట్వీట్ చేసింది. ఐనా, ఈ సమావేశంలో తాజా వ్యవహారం చర్చకు
వచ్చిందని తెలుస్తోంది. మాల్దీవ్స్ మంత్రుల వ్యాఖ్యలపై భారత్ తమ అభ్యంతరాలను
స్పష్టంగా తెలియజేసింది. మాల్దీవ్స్ కూడా తమ మంత్రుల ప్రవర్తనకు క్షమాపణలు
చెప్పింది.
మాల్దీవ్స్‌లో ఇటీవల ఎన్నికల తర్వాత చైనా
అనుకూల కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రభుత్వంలోని మంత్రులే భారత్‌పై తమ అక్కసు
వెళ్ళగక్కారు. దాని ప్రభావం వెంటనే కనిపించింది. ప్రధానంగా పర్యాటకంపై ఆధారపడిన ఆ
దేశానికి ఎక్కువగా పర్యాటకులు వెళ్ళేది భారత్ నుంచే. వారు తమ పర్యటనలను రద్దు
చేసుకున్నారు. ఫలితంగా గత రెండు రోజుల్లో మాల్దీవులకు వెళ్ళే పర్యాటకుల సంఖ్య
గణనీయంగా పడిపోయింది.
ఈ ముప్పు తీవ్రతను అంచనా వేసుకున్న
మాల్దీవ్స్ ప్రభుత్వం బేషరతుగా భారతదేశానికి క్షమాపణ చెప్పింది. మాల్దీవ్స్ కొత్త
అధ్యక్షుడు ‘చేతులు జోడించి’ మన్నించమని అడిగాడు. మాల్దీవ్స్ విదేశాంగ మంత్రి మూసా
జమీర్, విదేశీ నేతలపై తమ మంత్రులు వ్యాఖ్యలు ‘ఆమోదయోగ్యం కానివి’ అని ప్రకటించారు.
ఆ వ్యాఖ్యలు మాల్దీవ్స్ ప్రభుత్వ అధికారిక వైఖరిని ప్రతిబింబించడం లేవని స్పష్టం
చేసారు.