మాల్దీవులకు చెందిన ముగ్గురు మంత్రులు (maldeves ministers comments) ప్రధాని మోదీ, భారత్‌పై చేసిన వ్యాఖ్యల వివాదం కొనసాగుతోంది. ఇటీవల ప్రధాని మోదీ లక్షద్వీప్‌లో పర్యటించి పర్యాటక రంగాన్ని ప్రోత్సాహించే విధంగా కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై మాల్దీవులకు చెందిన ఎంపీలు, కొందరు మంత్రులు తీవ్ర విమర్శలకు దిగారు.మాల్దీవుల తరహాలో లక్షద్వీప్‌లో స్వచ్ఛత సాధించడం కష్టసాధ్యమంటూ విమర్శలు చేశారు.
దీనిపై తాజాగా ఆదేశ మాజీ డిప్యూటీ స్పీకర్ ఇవా అబ్దుల్లా స్పందించారు. మాల్దీవుల మంత్రులు, ఎంపీలు చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు.వారి వ్యాఖ్యలు జాత్యహంకారంతో కూడుకున్నవని, భారత్‌కు క్షమాపణ చెప్పాలని కోరారు. మాల్దీవుల పర్యాటకంపై బహిష్కరణ వేటు వేయాలంటూ సోషల్ మీడియాలో వస్తోన్న పోస్ట్‌లను ఆపాలని ఆయన అభ్యర్థించారు.
ప్రస్తుతం ఎంపీగా ఉన్న అబ్దుల్లా…మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలపై భారతీయులు కోపంగా ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. ఈ వ్యాఖ్యలు మాల్దీవుల ప్రజల అభిప్రాయాలను ప్రతిబింబించవన్నారు. భారత ప్రజలకు తాను వ్యక్తిగతంగా క్షమాపణ చెబుతున్నట్లు ప్రకటించారు. ప్రధాని మోదీ, భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను తొలగిస్తూ మాల్దీవుల ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
మాల్దీవులకు ప్రత్యామ్నాయంగా లక్షద్వీప్‌ను పర్యాటకంలో చేర్చుకోవాలంటూ ప్రధాని మోదీ పిలుపునిస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆ తరవాత మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. మాల్దీవులకు, లక్షద్వీప్ ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదని, అక్కడ స్వచ్ఛత పాటించడం అంత సులువు కాదంటూ విమర్శలు చేశారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈజ్‌మైట్రిప్ మాల్దీవులకు విమానటికెట్ బుకింగ్‌లను నిలిపివేసింది. మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యలపై భారత్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.