సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న వేళ రాజకీయ పార్టీలు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుని, ప్రచారానికి తెరలేపుతున్నాయి. కేంద్రంలోని అధికార బీజేపీ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించి దూసుడుమీదుంది. అదే దూకుడు కొనసాగించేందుకు బీజేపీ సిద్దం అవుతోంది. ఇప్పటికే ఎన్నికల సంఘం కూడా పని ప్రారంభించడంతో రాజకీయ పార్టీలు ప్రచారానికి సిద్దం అయ్యాయి. ఈ నెల 13న బిహార్ నుంచి ప్రధాని మోదీ ఎన్నికల శంఖారావం పూరిస్తారని తెలుస్తోంది.
బిహార్‌లోని 40 ఎంపీ స్థానాల్లో మెజారిటీ సీట్లు గెలిచేందుకు బీజేపీ దూకుడుగా వెళుతోంది. ప్రముఖులు అనేక బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. జనవరి 13న ప్రధాని మోదీ సభతో సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి తెరలేవనుంది. బిహార్‌లోని బెగూసరాయ్, బెతియా, ఔరంగాబాద్‌లలో ప్రధాని మోదీ ప్రసంగించే అవకాశం కనిపిస్తోంది. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి ప్రజల మనసులు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రధాని మోదీ పర్యటన ఒకవైపు, మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నడ్డా కూడా బిహార్ పర్యటనలు జరపనున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. జనవరి 15 తరవాత ప్రచారవేగం పెంచనున్నారు. ఇండీ కూటమిలో నితీశ్ కుమార్ ప్రధానంగా ఉండటంతో అక్కడ నుంచి బీజేపీ పావులు కదుపుతోందనే మాట వినిపిస్తోంది.