మాల్దీవుల్లో తాజాగా జరిగిన ఎన్నికల్లో గెలిచి, మహ్మద్ ముయిజు అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తరవాత ఆ దేశంతో భారత్ సంబంధాలు దెబ్బతిన్నాయి. తాజాగా ప్రధాని మోదీ లక్షద్వీప్‌లో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు అక్కడ పర్యటించారు. ప్రధాని పర్యటన తరవాత మాల్దీవుల మంత్రి ఎక్స్‌లో పెట్టిన పోస్ట్ వివాదం రాజేసింది. భారత్ మాల్దీవులను లక్ష్యంగా చేసుకుంటోందని మంత్రి ట్వీట్ చేశారు. బీచ్ పర్యాటకంలో మాల్దీవులతో పోటీపడటంలో భారత్ అనేక సవాళ్లు ఎదుర్కొంటోందన్నారు. లక్షద్వీప్‌లో ప్రధాని మోదీ స్నార్కెలింగ్ చేసిన వీడియో వైరల్ అయిన తరవాత మాల్దీవుల మంత్రి ట్వీట్ చేయడం గమనార్హం.
పర్యాటకులకు లక్షద్వీప్‌ను… మాల్దీవులకు ప్రత్యామ్నాయంగా చేయాలని భారత్ చూస్తోందని మంత్రి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. గత ఏడాది నవంబరులో ముయిజు మాల్దీవుల అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరవాత అక్కడ భారత సైనికులను తొలగించాలని కోరారు. త్వరలో ముయిజు చైనాలో పర్యటించనున్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ముయిజును ఆహ్వానిస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ తెలిపారు. ప్రస్తుత మాల్దీవుల అధ్యక్షుడు మొదటి నుంచి చైనా అనుకూల విధానాలను అవలంభిస్తున్నారు. మాల్దీవుల్లో చైనా అనేక అభివృద్ది ప్రాజెక్టులను కూడా చేపట్టింది.