జ్ఞానవాపిలోని మసీదు ప్రాంగణంలో భారత పురావస్తు శాఖ అధికారులు జరిపిన సర్వే నివేదిక బహిర్గతం చేయాలా? లేదా? అనే దానిపై జనవరి 24న తుది నిర్ణయం తీసుకోనున్నారు. నివేదిక బహిర్గతంపై వారణాసి జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎ.కె.విశ్వేష్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 24న కోర్టు నిర్ణయం మేరకు నివేదికను ఎప్పుడు బహిర్గతం చేసేది తేలుతుందని హిందువుల తరపు న్యాయవాది మదన్ మోహన్ యాదవ్ వెల్లడించారు.
జ్ఞానవాపి మసీదు ప్రాంతంలో పూర్వం కాశీవిశ్వనాథ ఆలయం ఉండేదని హిందువులు భావిస్తున్నారు. తరవాత ఆ దేవాలయం కూల్చివేసి దానిపై మసీదు నిర్మించారని హిందువులు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. మసీదు గోడలపై ఇప్పటికీ ఉన్న దేవతల ప్రతిమలకు పూజలు చేసుకునేందుకు అనుమతించాలని కూడా కోర్టును ఆశ్రయించారు. దీన్ని ముస్లిం సమాజం వ్యతిరేకిస్తోంది. కోర్టు ఆదేశాల మేరకు గత ఏడాది జులై 21న మసీదు ప్రాంగణంలో భారత పురావస్తు శాఖ శాస్త్రీయ సర్వే చేసి, ఇటీవల నివేదికను సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించింది.నాలుగు వారాలపాటు బహిర్గతం చేయవద్దని భారత పురావస్తు శాఖ అధికారులకు కోర్టును కోరారు.
అవసరం అని భావిస్తే, ఫాస్ట్ ట్రాక్ కోర్టు మరోసారి సర్వేకు ఆదేశించవచ్చంటూ అలహాబాద్ హైకోర్టు గత నెల 19 తీర్పు చెప్పింది.దీంతో సర్వే నివేదికను నాలుగు వారాలపాటు బహిర్గతం చేయకుండా ఉంచాలని ఏఎస్ఐ కోరింది.