Mother Teresa and forced
conversions
సెయింట్, మదర్, పేదల పాలిటి పెన్నిధి….
ఇవీ ఆవిడ పేరు ముందుండే విశేషణాలు. నిజానికి తెరెసా మీద ఉన్న ఆరోపణలూ, ఆవిడ చేసే
పనుల మీద వివాదాలూ అన్నీ ఇన్నీ కావు. మరణశయ్య మీదున్న వారిని మతమార్పిడులు చేయడం
నుంచి, రోగిష్టులు అష్టకష్టాలూ పడుతూ దయనీయమైన చావులు చనిపోయేలా వదిలేయడం వరకూ ఆమె
లీలలు ఎన్నో, ఎన్నెన్నో.
ఒకప్పటి ఒట్టోమాన్ సామ్రాజ్యంలోని,
ప్రస్తుతం ఉత్తర మాసిడోనియా దేశంలోని స్కోపియాలో పుట్టిన అల్బేనియన్ నన్ క్రైస్తవ
మతంలోని రోమన్ క్యాథలిక్ శాఖను అనుసరించింది. కొన్నాళ్ళు ఒట్టోమాన్ సామ్రాజ్యంలో నివసించాక, ఆమె ఐర్లాండ్‌కు
వెళ్ళిపోయింది. అక్కణ్ణుంచి భారతదేశానికి చేరుకుంది. అక్కడే కోల్‌కతా నగరంలో
జీవితాంతం గడిపి చివరికి అక్కడే తుదిశ్వాస విడిచింది.
భారతదేశంలో తెరెసా ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’
పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థ మొదలు పెట్టింది. ఆ సంస్థ మాటున వేలాది ప్రజలను సంఘసేవ
పేరుతో బలవంతంగా మత మార్పిడులు చేసింది. భారతదేశంలో ఆమెకు విస్తృత ప్రజాదరణ ఉంది.
రోమన్ క్యాథలిక్ క్రైస్తవ శాఖకు ప్రపంచ కేంద్రస్థానమైన వాటికన్ మద్దతు కూడా పుష్కలంగా
ఉంది. అయినప్పటికీ హఫింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ వంటి
అమెరికన్ మీడియా… తెరెసా నేతృత్వంలోని మిషనరీస్ నిర్వహించిన ఆస్పత్రులు, అనాథ
శరణాలయాల్లోని దయనీయమైన స్థితిగతుల పట్ల తమ ఆవేదనను, అసహ్యాన్నీ ప్రకటించడంలో
ఏనాడూ వెనుకడుగు వేయలేదు.
మదర్ తెరెసాను విమర్శించిన ‘నేరానికి’
ఎన్నోయేళ్ళు భయంభయంగా బతుకు గడిపిన డాక్టర్ అరూప్ ఛటర్జీ ఎట్టకేలకు ‘న్యూయార్క్
టైమ్స్’ ముందు నోరు విప్పాడు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం… మిషనరీస్ ఆఫ్ చారిటీ
నడిపే ఆస్పత్రుల్లో రోగులు తీవ్రబాధలు పడే నరకాన్ని ప్రత్యక్షంగా చూసాడు. మంచాలకు
కట్టివేసిన చిన్నపిల్లలు ఆ నొప్పి తట్టుకోలేక బాధతో పెట్టే కేకలు విన్నాడు.
మరణశయ్య మీదున్న రోగులు, ఏ మందులూ ఇవ్వకపోవడంతో బాధ భరించలేక ఏడవడాన్ని గమనించాడు.
మిషనరీస్ ఆఫ్ చారిటీ నిర్వహించే
ఆస్పత్రుల్లో అత్యంత ప్రాథమికమైన, ఏమాత్రం అప్డేట్ అవని మొరటు వైద్య విధానాలను
అనుసరించేవారు. హెచ్ఐవీ ఎయిడ్స్ పేషెంట్లను కూడా జాగ్రత్తగా చూసుకుంటామని కబుర్లు
చెబుతారు. కానీ ఆచరణలో మాత్రం ఏమీ ఉండదు. ఒకరికి ఉపయోగించిన సిరెంజి సూదులనే
మిగిలినవారికి కూడా ఉపయోగిస్తారు. దానికి వారు పెట్టిన పేరు ‘నిరాడంబరత’.
డాక్టర్ అరూప్ ఛటర్జీ న్యూయార్క్ టైమ్స్‌కు
రాసిన ఒక వ్యాసంలో రాసిన సంగతులు తెలుసుకుంటే అంతులేని జుగుప్స, అమితమైన ఆవేదనా
కలుగుతాయి. మిషనరీస్ ఆఫ్ చారిటీ ఆస్పత్రుల్లో సరైన వసతులు లేనందున రోగులు ఒకరి
ఎదురుగా ఒకరు మల విసర్జన చేసేవారు. రోగులకు 10 నుంచి 20 ఏళ్ళ క్రితం ఎక్స్పైర్
అయిపోయిన మందులు ఇచ్చేవారు. కదలలేని రోగుల మలమూత్రాల మరకలతో నిండిన దుప్పట్లనూ,
వారందరికీ ఆహారం తయారుచేసి వడ్డించే గిన్నెలూ కంచాలనూ ఒకే సింక్‌లో కడిగేవారు. ఈ
మిషనరీస్ నడిపే ఆస్పత్రుల్లో వాస్తవ పరిస్థితులు ఇలా ఉండేవి.
‘సోకాల్డ్ మదర్’ తెరెసా గురించి
హఫింగ్టన్ పోస్ట్ ప్రచురించిన వ్యాసంలో ఒట్టావా విశ్వవిద్యాలయం 2013లో చేసిన ఒక అధ్యయాన్ని
ఉటంకించారు. తెరెసా ఉదారత గురించి చెప్పే కథలన్నీ నిజానికి క్యాథలిక్ చర్చ్ చేసిన
విస్తృతమైన ప్రచారం మాత్రమే అని ఆ అధ్యయనం బైటపెట్టింది. ఆ అధ్యయనం ఇలా
చెప్పింది…
‘‘తెరెసా వంద దేశాల్లో 517 మిషన్స్
ప్రారంభించింది. కానీ ఆమె మరణించే సమయానికి వైద్యసేవల కోసం ఆ మిషన్స్‌లో ఏ ఒక్కదానికీ
ఒక్కరైనా వచ్చిన దాఖలాలు లేనే లేవు. వాటన్నింటిలో అపరిశుభ్రమైన వాతావరణం, అరకొర
ఆహారం, కనీసం పెయిన్‌కిల్లర్స్ ఉండని – రోగులకు ఏమాత్రం సరిపడని పరిస్థితులను
వైద్యులు గమనించారు. చిత్రమేంటంటే ఆ మిషన్స్‌కు నిధులకు కొరత ఏనాడూ లేదు. రోగులు
అనంతమైన బాధలో ప్రాణాలు కోల్పోవాలి అన్న ప్రత్యేకమైన సిద్ధాంతాన్నే తెరెసా
అనుసరించేంది. అందువల్లనే వారికి ఎలాంటి సౌకర్యాలూ అందకుండా మిషన్స్
నిర్వహించేది’’
భారతీయ క్యాథలిక్ క్రైస్తవులు మదర్‌గా
పిలుచుకునే తెరెసా ఒకసారి క్రిస్టొఫర్ హిచెన్స్ అనే రచయితకు ఇలా చెప్పింది:
‘‘పేదలు తమ పేదరికాన్ని ఒప్పుకోవడంలో, అందులో మగ్గిపోతూ క్రీస్తులాగే
బాధపడుతుండడంలో గొప్ప అందముంది. వారి బాధ వల్ల ప్రపంచానికి గొప్ప మేలు జరుగుతుంది.’’ ఆ మాటలు, పేదల
బాధలను చూసి శాడిస్టిక్‌గా ఆనందించే తెరెసా తత్వాన్ని కళ్ళకు కడతాయి.
తెరెసా శాడిజం చరిత్ర అక్కడితో ఆగలేదు.
వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం… మిషనరీస్ నడిపే ఆస్పత్రుల్లో మృత్యుశయ్య
మీదున్న రోగులను వారి మరణానికి ముందు బలవంతంగా క్రైస్తవ మతంలోకి మారుస్తారు.
వాషింగ్టన్ పోస్ట్ ఆ వ్యాఖ్యలను నిరాధారంగా చేయలేదు, లియో మాస్బర్గ్ రాసిన ‘మదర్
తెరెసా ఆఫ్ కలకతా: ఎ పెర్సనల్ పోర్ట్రెయిట్’ అనే పుస్తకం ఆధారంగానే ఈ మతమార్పిడుల విషయాన్ని
నిర్ధారించింది. తీవ్రమైన శారీరక బాధలో మానసిక ఆవేదనలో ఉండి ఏ క్షణంలో ప్రాణం
పోతుందో తెలీని అవస్థలో ఉన్న నిస్సహాయులను మతం మార్చడం తెరెసా శాడిజానికి
పరాకాష్ట.
1994లో క్రిస్టోఫర్ హిచెన్స్, జర్నలిస్ట్
తారిక్ అలీ ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని విడుదల చేసారు. దానిపేరు ‘హెల్స్ ఏంజెల్స్’.
తెరెసా స్థాపించిన సంస్థల భయంకరమైన వాస్తవ స్వరూపాన్ని ఆ డాక్యుమెంటరీ ప్రపంచం
ముందుకు తెచ్చింది.
2015లో ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ మోహన్
భాగవత్ రాజస్థాన్‌లో ఒక అనాథ శరణాలయాన్ని ప్రారంభించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ
‘‘నిస్వార్ధ బుద్ధితో సేవ చేయడం గొప్ప విషయం. కానీ మదర్ తెరెసా చేసే పనుల వెనుక
దురుద్దేశముంది. ఇతర మతాల వారిని క్రైస్తవులుగా మార్చివేయాలన్నదే ఆ దురుద్దేశం’’
అని స్పష్టంగా చెప్పారు.
మిషనరీస్ ఆఫ్ చారిటీ పేరుతో తెరెసా
చేసింది నిక్కమైన వ్యాపారమే. ఆమె మరణం తర్వాత కూడా మిషనరీస్ ఆఫ్ చారిటీ
ఎన్నోసార్లు విమర్శలకు గురయింది. ఆ సంస్థ మానవ అక్రమ రవాణాకు పాల్పడుతోందని 2018లో
ప్రభుత్వ సంస్థలు బైటపెట్టాయి.
మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థ జార్ఖండ్‌లోని
రాంచీలో నిర్వహిస్తున్న అనాథ శరణాలయం 14రోజుల వయసున్న చిన్నారిని విక్రయిస్తూన్న
సంగతి 2018లో బైటపడింది. ఆ కేసులో శిశు సంక్షేమ కమిటీ జోక్యం చేసుకోబట్టి జార్ఖండ్
పోలీసులు మిషనరీస్ ఆఫ్ చారిటీకి చెందిన ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసారు. ఆ కేసు
విచారణలో మిషనరీస్ సంస్థ కార్యాలయంలో రూ.1.40 లక్షల నగదు లభించింది. 14రోజుల
పిల్లవాడిని విక్రయించినందుకు సంస్థకు ముట్టిన నగదు అది.
తెరెసా కార్యకలాపాల వెనుక చీకటి నిజాలు ఎన్నిసార్లు
బైటపడినా, ఆమెను పేదల పెన్నిధిగా చిత్రీకరించడానికి అసంఖ్యాకమైన ప్రయత్నాలు
జరిగాయి. ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’ పేరుకి సమాజసేవా సంస్థ అని చెప్పుకుంటున్నా
నిజానికి అది మేకతోలు కప్పుకున్న తోడేలు లాంటిది. నిరుపేదలను వైద్యసేవల పేరిట ప్రలోభపెట్టి
వారిని మతం మార్చి వారి మాన మర్యాదలను దోచేసి
నిస్సహాయ మరణానికి గురిచేసే మతమార్పిడి ముఠాయే మిషనరీస్ ఆఫ్ చారిటీ, ఆ ముఠా
నాయకురాలు తెరెసా. రోమన్ క్యాథలిక్ సామ్రాజ్యపు ప్రచార మాయలో ప్రపంచం ఆమెను మదర్
తెరెసా, సెయింట్ తెరెసా అనుకోవచ్చు గాక, ఆమె నిజానిజాలు చరిత్రలో నమోదై ఉన్నాయి.
(భారతదేశపు పేదలను మతం మార్చి, వారికి మెరుగైన
వైద్యచికిత్స మీద ఆశలు కల్పించి, అవేవీ తీరకుండా అనేక అగచాట్లు పడుతూ, వారు నిర్భాగ్యులుగా
ప్రాణాలు కోల్పోయేలా చేసిన తెరెసా భారతదేశానికి వచ్చిన రోజు 1929 జనవరి 6.)