సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్1 (aditya L1) తుది కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇవాళ ఈ కీలక విన్యాసం పూర్తి చేసింది. 15 లక్షల కి.మీ ప్రయాణించి ఆదిత్య ఎల్1 లగ్రాంజ్ పాయింట్ చేరుకుంది. అక్కడి నుంచి ఆదిత్య ఎల్1 సమాచారం అందిస్తుంది. దీంతో ఈ ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ ప్రకటించారు. ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధాని మోదీ అభినందిస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
భారత్ ప్రయోగించిన తొలి సోలార్ అబ్జర్వేటరీ ఆదిత్య ఎల్1 తుది కక్ష్యను చేరుకుంది. మానవాళి ప్రయోజనాల కోసం ఇస్రో మరో ఘనత సాధించిందని ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ఆదిత్య ఎల్1 సౌరవాతావరణాన్ని అధ్యయనం చేసి, సమాచారం పంపనుంది.
గత సంవత్సరం సెప్టెంబరు 2న శ్రీహరికోట నుంచి ఇస్రో ఈ మిషన్ ప్రయోగం చేపట్టింది. సూర్యుడిపై ప్రయోగాలకు ఇస్రో చేపట్టిన మొదటి మిషన్ ఇదే కావడం గమనార్హం. సౌర వాతావరణం, సౌర జ్వాలలు, కరోనల్ మాస్ ఎజెక్షన్ విజయాలను అధ్యయనం చేసి ఆదిత్య ఎల్ 1 ఎప్పటికప్పుడు ఇస్రోకు సమాచారం పంపనుంది.