ఇజ్రాయెల్‌పై మరో ఉగ్రవాద సంస్థ విరుచుకుపడింది. అక్టోబరు 7న గాజాలోని హమాస్ ఉగ్రదాడి తరవాత, ఇజ్రాయెల్‌పై మరోసారి భారీ దాడి జరిగింది. లెబనాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లా (hezbollah attacks) ఇవాళ 60 రాకెట్లతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది. మౌంట్ మెరోన్లోని గగనతల నిఘా స్థావరంపై ఈ దాడులు జరిపారు.రాకెట్లు నేరుగా అనుకున్న లక్ష్యాన్ని తాకాయని హెజ్బొల్లా ప్రకటించింది. హమాస్ నేత సలేహ్ అరౌరీని హతమార్చిన రెండో రోజే హెజ్బొల్లా ఈ దాడులకు దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇజ్రాయెల్ దాడిలో హమాస్ డిప్యూటీ నేత సలేహ్ అరౌరి హతమైన సంగతి తెలిసిందే. దీనికి సరైన సమాధానం ఇవ్వకుంటే ఇజ్రాయెల్, రాబోయే రోజుల్లో లెబనాన్‌పై కూడా దాడికి దిగుతుందని హెజ్బొల్లా ఉగ్రసంస్థ నేత హసన్ నస్రల్లా ప్రకటించారు. ఆయన ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. హెజ్బొల్లా దాడులను ఇజ్రాయెల్ ధ్రువీకరించింది. ఎదురుదాడికి దిగినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ప్రాణ నష్టం వివరాలు అందాల్సి ఉంది.