బీజేపీ
పాలనలో అన్నివర్గాలకు సమన్యాయం దక్కుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి
అన్నారు. ఏలూరులో జరిగిన పార్టీ పదాధికారులు సమావేశంలో పాల్గొన్న పురందరేశ్వరి,
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పదేళ్ళుగా ‘సబ్ కా సాత్ సబ్ కా వికాస్’
లక్ష్యంతో పనిచేస్తోందన్నారు.
గత
టీడీపీ ప్రభుత్వం తరహాలోనే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం కూడా కేంద్రపథకాలకు తమ
స్టిక్కర్లు వేసుకుంటుదని దుయ్యబట్టారు. రాష్ట్రానికి కేంద్రం అందిస్తోన్న సాయంతో
పాటు మోదీ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల గురించి వికసిత్ భారత్
కార్యక్రమంలో వివరిస్తున్నామన్నారు.
ఎస్సీలకు
సంబంధించిన 27 పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు
చేసిందని ఆరోపించిన పురందరేశ్వరి, జగన్ పాలనలో దళితులపై వివక్ష పెరగడం బాధాకరమన్నారు.
ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న జనసేనతో పొత్తులోనే ఉన్నామని పునరుద్ఘాటించారు.