బ్యాంకు ఖాతాలో కనీస నగదు నిల్వ లేకపోతే కొన్ని బ్యాంకులు పెనాల్టీల పేరుతో భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నగదు బదిలీ కోసం తెరిచిన ఖాతాలు, విద్యార్థులకు ఉపకార వేతనాల కోసం తెరిచిన ఖాతాలు రెండేళ్లకు మించి వాడుకలో లేకపోతే అలాంటి ఖాతాదారులపై ఛార్జీలు వేయవద్దని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించింది. ఖాతాలు వాడుకలో లేకపోతే నిరుపయోగంగా మారుతాయనే సమాచారం వివిధ రూపాల్లో పంపించాలని, ఒకవేళ ఖాతాదారుడు అందుబాటులో లేకపోతే నామినీలకు సమాచారం ఇవ్వాలని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించింది. బ్యాంకుల్లో అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు రూ.42 వేల కోట్లు దాటిపోవడంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
2023 మార్చి చివరి నాటికి బ్యాంకుల్లో అన్క్లెయిమ్డ్ నగదు..రూ.42272 కోట్లు దాటిపోయింది. అంతక ముందు ఏడాది ఈ మొత్తం రూ.32,934కోట్లుగా ఉంది. అంటే ఒక్క ఏడాదిలోనే 28 శాతం పెరిగింది. క్లెయిమ్ చేయని డిపాజిట్లను నామినీలు, హక్కుదారులకు అందించేందుకు UDGAM పేరుతో ఓ వెబ్సైట్ అందుబాటులోకి తెచ్చారు. గడువు దాటిన డిపాజిట్లు పదేళ్లపాటు ఎవరూ తీసుకోకపోతే ఆ మొత్తాలను డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ కార్యక్రమానికి బదిలీ చేయాల్సి ఉంటుంది.