వైసీపీలో టికెట్ల కేటాయింపు వ్యవహారం రచ్చకెక్కింది. ఆ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి (YS Jaganmohanreddy) ఇప్పటికే 32 మంది ఎమ్మెల్యేల టికెట్లు చింపేశారు. ఆరుగురు ఎంపీలు, పలువురు మంత్రుల టికెట్లు కూడా గల్లంతయ్యాయి. దీంతో వైసీపీ నేతలు తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని కాదని గంజి చిరంజీవిని నియోజకవర్గ ఇంఛార్జిగా నియమించడంతో గొడవ మొదలైంది. ఇప్పటికే ఆర్కే పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో చేరిన షర్మిళ వెంట నడువనున్నట్లు ప్రకటించారు.
తొలి విడతగా ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 11 మంది ఎమ్మెల్యేలకు వైసీపీ అధినేత స్థానచలనం కలిగించారు. వీరిలో మంత్రులు ఆదిమూలపు సురేష్,మేరుగ నాగార్జున సహా 9 మంది ఎమ్మెల్యేలున్నారు. ఇక తాజాగా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి టికెట్ చినిగిపోయింది. శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయానికి పిలిపించి త్వరలో జరగబోయే ఎన్నికల్లో టికెట్ లేదని చెప్పేశారు. దీంతో కాపు రామచంద్రారెడ్డి క్యాంపు కార్యాలయం గేటు వద్ద మీకు, మీ పార్టీకి ఓ నమస్కారం అంటూ అక్కడ నుంచి వెళ్లిపోయారు. వచ్చే ఎన్నికల్లో తాను రాయదుర్గం నుంచి తన భార్య కళ్యాణదుర్గం నుంచి స్వతంత్ర్య అభ్యర్థులుగా పోటీ చేస్తామని కూడా ఆయన వైసీపీ అధినేతకు హెచ్చరికలు పంపారు.
నరసరావుపేట సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు టికెట్ కూడా చింపేశారు. శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డిని కలిశారు. నరసరావుపేట టికెట్ ఇవ్వలేమని, గుంటూరు నుంచి పోటీకి సిద్దంగా ఉండాలని లావును కోరారు. గుంటూరు నుంచి తాను పోటీ చేసేందుకు సిద్దంగా లేనంటూ లావు శ్రీకృష్ణదేవరాయలు తేల్చి పడేశారు.దీంతో ఇక ఆయన పార్టీని వీడటం లాంఛనమేననే ఊహాగానాలు హచ్‌చల్ చేస్తున్నాయి. ఇప్పటికే గుంటూరు ఎంపీ సీటు కేటాయిస్తామంటూ మాజీ క్రికెటర్ అంబటి రాయుడుని పార్టీలోకి చేర్చుకున్నారు. తాజాగా ఆ సీటు లావుకు ప్రతిపాదించడంతో అంబటి రాయుడు పార్టీకి రాజీనామా చేశారు. కేవలం వారం రోజులే రాజకీయాల్లో ఉన్న అంబటి రాయుడు, కొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉంది.
ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు వైసీపీ ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి కూడా ఆ పార్టీ నేతల ఆదేశాలను ధిక్కరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, జనసేనాని పవన్‌లను విమర్శిస్తూ ప్రెస్‌మీట్ పెడితే టికెట్ ఇస్తామంటూ మహీధర్‌రెడ్డికి రాయబారాలు పంపినట్లు తెలుస్తోంది. అయితే అందుకు ఆయన నిరాకరించినట్లు, దీంతో అక్కడ వైసీపీ కొత్త అభ్యర్థి కోసం గాలిస్తోన్నట్లు కూడా కథనాలు వస్తున్నాయి.
ప్రకాశం జిల్లా దర్శి సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ సీటు ఊగిసలాటలో ఉంది. శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో వేణుగోపాల్ వైసీపీ కీలక నేతలతోపాటు, నేరుగా సీఎంతో మాట్లాడారు. అయితే దర్శి టికెట్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డికి కేటాయించామని చెప్పేశారు. వేణుగోపాల్‌కు మరెక్కడైనా సీటు ఇస్తారా లేదా అనే విషయం మాత్రం తేలాల్సి ఉంది. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి బయటకు వచ్చిన మద్దిశెట్టి, తన సీటు ఖరారు కాలేదని చెప్పేసివెళ్లిపోయారు. ఎక్కడా టికెట్ రాకపోతే అప్పుడు చెపుతానంటూ హెచ్చరికలు జారీ చేసి మరీ సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వెళ్లిపోయారు.
ప్రకాశం జిల్లా గిద్దలూరు సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు పోటీకి సుముఖత చూపడం లేదు. శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎంతో ఆయన భేటీ అయ్యారు. మీరు మనసు మార్చుకుంటే, సీటు గురించి ఆలోచిస్తామని చెప్పినట్లు రాంబాబు తెలిపారు. అయితే గడచిన నాలుగేళ్లలో పార్టీలో తనకు అనేక అవమానాలు జరిగాయని ఆయన వాపోయారు. గిద్దలూరు టికెట్ ఇచ్చినా ఆయన పోటీలో నిలిచేలా కనిపించడం లేదనే వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు జెండా పీకేశారు. ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రమోహన్ రెడ్డి, శ్రీథర్ రెడ్డి పార్టీని వీడారు. వీరు ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో పనిచేస్తున్నారు. ఇక తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వైసీపీకి ఎప్పుడో గుడ్ బై చెప్పారు.
తాజాగా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి, ఒంగోలు ఎంపీ హైదరాబాద్ నుంచి రాజకీయాలు నడుపుతున్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్దంగా ఉండాలని పార్టీ అధిష్టానం చెప్పడంతో ఆయన సుముఖంగా లేరని తెలుస్తోంది. ఇక ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే బాలినేనిని అక్కడి నుంచి మార్చే యోచనలో ఉన్నట్లు సంకేతాలిచ్చారు. దీనికి బాలినేని అంగీకరించలేదనే వార్తలు వస్తున్నాయి. ఒంగోలు సీటు ఇస్తే పోటీ చేయడం, లేదంటే పార్టీ వీడే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
విశాఖ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసేశారు. అక్కడ మరికొందరు కీలక నేతలు కూడా పార్టీని వీడారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్‌గా చేసిన సుధాకర్ వైసీపీని వీడారు.ఇక కాకినాడ, పిఠాపురం,జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా టికెట్లు లేవని చెప్పడంతో వారు కూడా పక్క చూపులు చూస్తున్నారు. విజయవాడ సెంట్రల్ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సీటు కూడా చినిగిపోయింది. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లిని సెంట్రల్‌కు పంపడంతో ఇక్కడ నిప్పు రాజుకుంది. ఎమ్మెల్యే విష్ణు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు మొండిచేయి చూపారు. వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వలేమని చెప్పేశారు. దీంతో బాబు రెచ్చిపోయారు. తరవాత మాటమార్చి జగన్ మా దేవుడు అంటూ చెప్పుకొచ్చారు. ఇక హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌కు టికెట్ లేదని చెప్పడంతో ఆయన రెచ్చిపోయినట్లు తెలుస్తోంది. సీఎం క్యాంపు కార్యాలయంలో మాధవ్‌కు సీఎం క్లాస్ పీకడంతో అక్కడ నుంచి వెళ్లిపోయాడనే వార్తలు వస్తున్నాయి.వైసీపీలో రాబోయే కొద్ది రోజుల్లో మరికొన్ని టికెట్లు చినిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. టికెట్లు చిరిగిన వారు తిరుగుబాటు చేయడం, పార్టీలు మారడం ప్రతి ఎన్నికలకు ముందు చూస్తున్నదే కదా. అయితే ఈ సారి కొంచెం ఎక్కువగా ఇలాంటి వార్తలు వినాల్సి ఉంటుంది.