కోస్తా
ప్రాంతంలో టీడీపీకి స్వతహాగా ఉన్న బలానికి తోడు పాలకపార్టీగా వైసీపీపై ఉండే
ప్రజావ్యతిరేకత, అమరావతి రాజధాని వివాదం తమకు మేలు చేస్తాయని తెలుగు తమ్ముళ్ళు
లెక్కలేసుకుంటున్నారు. ఈ సారి తమదే పైచేయి అవుతుందంటూ అంటూ జోష్ మీదున్నారు. వారి
ఆశలకు విజయవాడ ఎంపీ టికెట్ వివాదం గండికొట్టేలా ఉంది. దీంతో కేశినేని నాని
వివాదానికి ముగింపు పలికేందుకు తెలుగుదేశం అధిష్టానం తర్జనభర్జన పడుతోంది. కేశినేని
నాని పార్టీని వీడినా తమకు రాజకీయంగా నష్టం జరగకుండా ఉండేలా ప్లాన్లమీద ప్లాను
వేస్తోంది.
విజయవాడ
ఎంపీ కేశినేని నానికి వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఇవ్వడం లేదు. పార్లమెంటు
పరిధిలో జరిగే పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనవద్దని హైకమాండ్ నానికి తెలిపింది.
తిరువూరులో జరిగే బహిరంగసభ ఏర్పాట్లలోనూ జోక్యం చేసుకోవద్దని తేల్చి చెప్పింది.
పార్టీ పెద్దలు ఆయన ఇంటికి వెళ్లి మరీ ఈ విషయాన్ని వివరించారు.
టీడీపీ
అధినేత నిర్ణయంతో మనస్తాపం చెందిన కేశినేని నాని, ఎంపీ పదవితో పాటు పార్టీకీ రాజీనామా
చేయబోతున్నట్లు ప్రకటించారు. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచి హ్యాట్రిక్
కొడతానంటూ ఆయన వ్యాఖ్యానించినట్లు వార్తలు కూడా వచ్చాయి.
సైకిల్
గుర్తుపై రెండు పర్యాయాలు ఎంపీగా విజయం సాధించిన నానికి విజయవాడ పార్లమెంటు
నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. ఆయన ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు నియోజకవర్గంలో మంచి ఓటు బ్యాంకు సృష్టించాయి. టాటా సంస్థతో కలిసి గతంలో అమలు చేసిన హెల్త్ ఇన్సూరెన్స్
పథకం ఆయనను ప్రజలకు బాగా దగ్గర చేసింది.
ప్రజలకు
ఎంత దగ్గరయ్యారో టీడీపీ అధిష్టానానికి అంత దూరం అయ్యారనే విశ్లేషణలు కూడా ఉన్నాయి.
గతంలో కేశినేని నాని పార్టీ నేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో టీడీపీ
ఇబ్బందిపడింది. దేవినేని ఉమా, బుద్ధా వెంకన్నతో ఆయనకు ఉన్న రాజకీయ విభేదాలకు తోడు
ఆయన ముక్కుసూటితనం పార్టీకి దూరం చేసిందని పలువురు అభిప్రాయపడుతున్నారుి.
కేశినేని
నానికి చెక్ పెట్టే ఉద్దేశంతోనే అతడి సోదరుడు కేశినేని శివనాథ్(చిన్నా) ను ప్రొత్సహించారనే
వాదన కూడా ఉంది. ఆయన ప్రస్తుతం తిరువూరు
నియోజకవర్గం(ఎస్సీ రిజర్వుడు) ఇంఛార్జిగా ఉంటూ అన్నా క్యాంటీన్, వైద్య శిబిరాలు నిర్వహిస్తూ
పార్టీశ్రేణులతో మమేకం అయ్యారు.
2024
అసెంబ్లీ ఎన్నికల్లో తిరువూరును టీడీపీ ఖాతాలో వేయడమే లక్ష్యంగా
చెమటోడుస్తున్నారు.
అందుకే
తిరువూరులో నిర్వహించే సభకు హాజరు కావద్దు
అని కేశినేని నానికి అధిష్టానం స్పష్టం చేయడంతో
ఆయన వేరే దారి వెతుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది.
రాజకీయాల్లో
మొండిఘటంగా పేరున్న కేశినేని నాని రాజకీయ ప్రస్థానం మిగతా నేతలతో పోల్చుకుంటే చాలా
భిన్నంగా ఉంటుంది. ప్రత్యర్థి పార్టీల్లో స్నేహితులు, సొంత పార్టీలో రాజకీయ శత్రువులు ఉన్న
ఏకైక నేత.
టీడీపీని వీడిన తర్వాత కేశినేని
ఏ పార్టీలో చేరుతారనేది అంచనా వేయడం కష్టంగా మారింది.
విజయవాడ పశ్చిమ సీటు ముస్లింలకు ఇవ్వాలని పట్టుబట్టే నాని, బీజేపీతో రాజకీయ ప్రయాణం కొనసాగించగల్గుతారా అనే
అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సీఏఏ, ఎన్ఆర్సీ
విషయంలో హైకమాండ్ ఆదేశాలు ధిక్కరించి ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. అమరావతి, చంద్రబాబు
అరెస్టు విషయంలో వైసీపీ తీరును తీవ్రంగా వ్యతిరేకించిన నాని ఇప్పుడు ఆ పార్టీలో
చేరే అవకాశాలు తక్కువే.