పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ పార్టీ నేతను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. రేషన్ కుంభకోణంలో శంకర్ ఆదిత్య నిందితుడిగా ఉన్నాడు. గత కొంత కాలంగా తప్పించుకు తిరుగుతున్న శంకర్ ఆదిత్యను ఈడీ అధికారులు 24 పరగణాల జిల్లాలో శనివారం అర్థరాత్రి అరెస్ట్ (ration scam ed arrests tmc leader) చేశారు. గురువారంనాడు శంకర్ ఆదిత్యను అరెస్ట్ చేసే క్రమంలో ఈడీ అధికారులపైనే స్థానికులు దాడికి దిగారు. శంకర్ ఆదిత్య గతంలో బాన్గాన్ మున్సిపాలిటీ ఛైర్మన్గా చేశాడు. ఇతనితోపాటు షేక్ షాజహాన్ కూడా ఈ కేసులో నిందితుడిగా ఉన్నారు.
ఈడీ అధికారులు అరెస్ట్ చేస్తారని తెలియగానే తృణమూల్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈడీ అధికారులపైనే దాడికిదిగి గాయపరిచారు. అధికారుల కారు అద్దాలు పగలకొట్టారు. బీజేపీ నేతల ఒత్తిడి మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థలు తమపార్టీ నేతలను లక్ష్యంగా చేసుకున్నాయని తృణమూల్ నేత కునాల్ ఘోష్ ధ్వజమెత్తారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలపై అసత్య ప్రచారం చేస్తూ, ప్రజలను రెచ్చగొట్టేవిధంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు వ్యవహరిస్తున్నాయని ఆయన విమర్శించారు.