అగ్రరాజ్యం అమెరికాలో కాల్పులకు (america fire incidents) బలైపోతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. కొందరు ఉన్మాదులు తుపాకులతో రెచ్చిపోవతుండటంతో సామాన్యులు, విద్యార్థులు బలైపోతున్నారు. నూతన సంవత్సరంలోని మొదటి నాలుగు రోజుల్లోనే 400 మంది కాల్పుల్లో చనిపోయారని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, అమెరికాలో కాల్పుల ఘటనలు మాత్రం తగ్గడం లేదు. వీటిని ఎలా అణచివేయాలో తమకు తెలుసని కమలా హారిస్ స్పష్టం చేశారు.
ఆయుధ నిషేధాన్ని పునరుద్ధరించేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తోంది. దేశ వ్యాప్తంగా అమలు చేయాలని చూస్తోంది. కాల్పుల ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలుంటాయని, ఇందుకు ఎవరూ అతీతులు కాదని కమలా హారిస్ హెచ్చరించారు. తాజాగా అయోవాలోని పెర్రీ హై స్కూల్లో ఓ విద్యార్థి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు. ప్రిన్సిపల్ సహా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కాల్పులకు తెగబడ్డ విద్యార్థిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.