రాజమహేంద్రవరంలో
అంతర్జాతీయ రెండోవ తెలుగు మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గైట్ కాలేజీ ప్రాంగణంలో
నిర్వహిస్తోన్న ఈ సభలను ఛత్తీస్గఢ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, విశాఖ శారదా
పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, జ్యోతి వెలిగించి ప్రారంభించారు. మహాసభలను ఆంధ్ర
సారస్వత పరిషత్, చైతన్య విద్యా సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
రాజరాజనరేంద్రుడి
పేరుతో ప్రధాన వేదికను ఏర్పాటు చేసిన నిర్వాహకులు ఆదికవి నన్నయ్య, కవి నారాయణ
భట్టు మరో రెండు అనుబంధ వేదికలు సిద్ధం చేశారు.
ఈ తెలుగు పండుగలో ప్రసంగించిన ఆర్ఎస్ఎస్ ప్రముఖ్
రాంమాధవ్, తెలుగు భాషకు 2,500 ఏళ్ళ చరిత్ర ఉందని తెలిపారు. తెలుగు మాట్లాడేందుకు,
పిల్లలతో మాట్లాడించేందుకు తల్లిదండ్రులు ఇష్టపడటం లేదని స్వరూపానందేంద్ర సరస్వతి
అన్నారు.
విదేశాల్లో
కూడా మాతృభాషలో విద్యా బోధన జరుగుతుంటే మన రాష్ట్ర పాలకులు ఆంగ్లం వెంట పరిగెత్తడం
ఎంతవరకు సమంజసమని పలువురు వక్తలు ప్రశ్నించారు. మాతృభాష అంతమైతే తెలుగు జాతి అస్థిత్వమే
ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
మహాసభల సందర్భంగా రేపు సాయంత్రం ‘తెలుగు తోరణం’
నృత్యరూపక ప్రదర్శన, విశిష్ట సేవా పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. ఆదివారం రోజు
ఆన్ లైన్ లో కవిసమ్మేళనం నిర్వహించనున్నారు. రాజరాజనరేంద్రుడికి వెయ్యి మంది
కవులు, వెయ్యి కవితలతో నీరాజనం పలకనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.