రాజధాని అమరావతి ఆర్-5 జోన్ వ్యవహారంలో దాఖలైన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్కు వాయిదా వేసింది. రైతులిచ్చిన భూములను పేదల పేరుతో పంచుతున్నారంటూ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో ఇవాళ వాదనలు జరిగాయి. త్వరగా కేసును తేల్చాలంటూ ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ చేసిన వాదనలను అత్యున్నత ధర్మాసనం తోసిపుచ్చింది. ఏప్రిల్ మాసంలో నాన్ మిస్లేనియస్ డేలో విచారణ చేపడతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
అమరావతి రాజధానికి సంబంధించిన కేసు కూడా ఇదే ధర్మాసనంలో పెండింగ్లో ఉందని, రైతుల తరపు న్యాయవాది దేవదత్ కామత్ న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. సెంటు భూమి పేరుతో రైతుల భూముల్లో పేదల నివాస గృహాలు నిర్మించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని వాదనలు వినిపించారు. పేదలకు ప్రభుత్వం చేస్తున్న సాయాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారంటూ సింఘ్వీ చేసిన వాదనలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పందించారు. అమరావతిలో ఏం జరుగుతోందో తనకు తెలుసని న్యాయమూర్తి వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. కేసు తదుపరి విచారణ ఏప్రిల్కు వాయిదా వేశారు.