చిన్న గొడవ చిలికిచిలికి గాలివానలా మారింది. పెళ్లి తంతు పూర్తి చేసుకుని మెట్టినింటికి వచ్చిన సమయంలో జరిగిన గొడవలో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. తెలంగాణలోని చేగుంట మండలం రెడ్డిపల్లి కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం. రెడ్డిపల్లి గ్రామంలోని వడ్డెరపల్లెకు చెందిన ఉప్పు వెంకటి కూతురు సువర్ణ పెళ్లి గురువారం జరిగింది. గురువారం రాత్రి అందరూ ఆనందంగా ఊరేగింపు నిర్వహించారు. సువర్ణను బికనూరు మండలం లక్ష్మిదేవిపల్లిలోని అత్తారింటికి పంపారు. అక్కడ నుంచి మరలా ఇంటికి వస్తుండగా అదే కాలనీకి చెందిన ఉప్పు నరేందర్, స్వామి అనేక ఇద్దరు గొడవపడ్డారు.
స్వామి అనే వ్యక్తి నరేందర్‌ను నెట్టేయడంతో కిందపడిపోయాడు. కొందరు అతన్ని పక్కకు తీసుకెళ్లారు. తరవాత నరేందర్ ఆగ్రహంతో అక్కడే ఉన్న ఓ కారును వేగంగా నడిపి పెళ్లి బృందంపై ఎక్కించాడు. ఈ ఘటనలో రమ్య, దుర్గయ్య, సుజాత, యాదగిరి, సురేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. రమ్యను హైదరాబాద్ తరలిస్తుండగా చనిపోయింది.నరేందర్ కారును వేగంగా నడుపుతున్న సమయంలో యాదగిరి అనే యువకుడు బైక్ అడ్డుపెట్టడంతో పెద్ద ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు. నరేందర్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.