రెండు రోజుల కిందట ఇరాన్లో జరిగిన జంట పేలుళ్లలో వంద మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ పేలుళ్లకు పాల్పడింది ఎవరనే విషయంలో స్పష్టత వచ్చింది. ఈ జంట బాంబులు పేల్చింది తామేనని అంతర్జాతీయ ఉగ్రసంస్థ ఐసిస్ ప్రకటించింది. పేలుళ్లకు పాల్పడింది ఒమర్ అల్ మువాహిద్, సేపుల్లా అల్ ముజాహిద్ అంటూ వారి ఫోటోలను కూడా వారి వార్తాపత్రిక అమఖ్ ద్వారా వెల్లడించారు. ఆత్మాహుతికి పాల్పడింది ఏ దేశానికి చెందిన వారు అనే విషయంలో మాత్రం స్పష్టత రావాల్సి ఉంది.
ఆత్మాహుతి దాడుల ద్వారా పేలుళ్లకు పాల్పడినట్లు ఐసిస్ ప్రకటించింది. ఇరాన్ మాజీ జనరల్ సులేమానీ సమాధి వద్ద వేలాది మంది నివాళులర్పించేందుకు వెళుతున్న క్రమంలో ఈ పేలుళ్లు జరిపారు. ఉగ్రవాదులు వారి శరీరానికి అమర్చుకున్న బాంబులను పేల్చుకోవడం ద్వారా ఈ దురాగతానికి ఒడిగట్టారు. గతంలో కూడా ఐసిస్ ఉగ్రవాదులు ఇరాన్లో బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. సామాన్యులు, భద్రతా బలగాలే లక్ష్యంగా గతంలో పేలుళ్లకు తెగబడ్డారు. సులేమానీ ఐసిస్‌పై పోరాటం జరిపారు. ప్రతిగా ఐసిస్ ఆత్మాహుతి దాడులకు దిగిందని తెలుస్తోంది.