దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా మొదటి టెస్టులో పరాజయం చెందిన భారత్ జట్టు రెండో టెస్టులో ప్రతీకారం తీర్చుకుంది. కేప్ టౌన్ వేదికగా రెండో టెస్టులో భారత జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్ 1-1తో సమం అయింది.
తొలి ఇన్నింగ్స్ లో సఫారీ జట్టు 55 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్ 153 పరుగులు చేసింది. ఇక్కడే ఓ చెత్త రికార్డును రోహిత్ సేన మూటగట్టుకుంది. 153 పరుగుల వద్దే భారత్ ఆరు వికెట్లు కోల్పోయి ఆలౌట్ అయింది.
రెండో ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా జట్టు 176 పరుగులు మాత్రమే చేయగల్గింది. ఓవర్ నైట్ స్కోర్ 62/3 తో రెండో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన సౌత్ ఆఫ్రికా 114 పరుగులు చేసింది. మార్ క్రమ్ (106) దూకుడుగా ఆడాడు. జస్ ప్రీత్ బుమ్రా ఆరు వికెట్లు పడగొట్టగా, ముకేశ్ కుమార్ రెండు, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరొక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
లక్ష్య ఛేదనలో ఓపెనర్ యశస్వీ జైస్వాల్ 28 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. రోహిత్ శర్మ (17*) శుభమన్ గిల్(10), విరాట్ కోహ్లీ(12), శ్రేయాస్ అయ్యర్(4*) లు జట్టు ను విజయం వైపు నడిపించారు. మహ్మద్ సిరాజ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడ, నండ్రీ బర్గర్, మార్కో జాన్సన్ తలా ఒక వికెట్ తీశారు. తాజా గెలుపుతో కేప్ టౌన్ లో టెస్ట్ మ్యాచ్ గెలిచిన తొలి ఆసియా జట్టుగా భారత్ ఘనత సాధించింది.