What did Modi do in Lakshadweep?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) మంగళవారం నాడు లక్షద్వీప్‌లో (Lakshadweep) పర్యటించారు. అక్కడ
ఆయన ఏం చేసారో తెలుసా? సముద్రం లోపలికి వెళ్ళి (Snorkelling) సాగరగర్భంలోని ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించి వచ్చారు. ఆ చిత్రాలను
ఆయన ఇవాళ ఎక్స్‌లో షేర్ చేసారు.
కేంద్రపాలితప్రాంతమైన లక్షద్వీప్
అరేబియాసముద్రంలో ఉన్న చిన్నచిన్న దీవుల సముదాయం. పలు అభివృద్ధి పనులను
ప్రారంభించడానికి మోదీ ఈ మంగళవారం అక్కడకు వెళ్ళారు. ఆ పర్యటనలో భాగంగా అధికారిక
కార్యక్రమాలతో పాటు కొంత విశ్రాంతి కూడా తీసుకున్నారు. ఆ సందర్భంలోనే మోదీ
స్నోర్కెల్లింగ్ అనే సాహస క్రీడను ప్రయత్నించారు. ‘అదో అద్భుతమైన అనుభవం’ అని మోదీ
వ్యాఖ్యానించారు.
లక్షద్వీప్‌లో సముద్రం అడుగుకు వెళ్ళే
స్నోర్కెల్లింగ్ అనే సాహసవిన్యాసం చేసిన మోదీ, దానికి సంబంధించిన పలు చిత్రాలను
ఎక్స్‌లో పంచుకున్నారు. లక్షద్వీప్‌లోని అందమైన ప్రకృతి దృశ్యాలను షేర్ చేసిన మోదీ
‘‘తమలోని సాహసికుణ్ణి వెలికి తీయాలి అనుకునేవారు లక్షద్వీప్ తప్పనిసరిగా
చూడాల్సిందే’’ అని కామెంట్ పెట్టారు.
సముద్రతీరంలో మోదీ ప్రశాంతంగా విశ్రాంతి తీసుకున్నారు. బీచ్‌లో
ఓ కుర్చీ వేసుకుని ఆహ్లాదంగా ప్రకృతిని ఆస్వాదిస్తున్న ఫొటోలను సైతం ఆయన షేర్
చేసారు. ‘‘ఇలాంటి స్వచ్ఛమైన బీచ్‌లలో తెల్లవారుజామున నడిచే క్షణాలు గొప్ప అనుభవాన్ని
ఇస్తాయి’’ అని వ్యాఖ్యానించారు.
లక్షద్వీప్ ప్రజల
ఆతిథ్యానికి మోదీ ధన్యవాదాలు చెప్పారు. ‘‘లక్షదీవుల ప్రకృతి సౌందర్యం నన్ను విభ్రముణ్ణి
చేసింది. అక్కడి ప్రజల సాదర ఆతిథ్యం మనసును ఆర్ద్రం చేసింది’’ అని మోదీ ఎక్స్‌లో
రాసుకొచ్చారు.