రూట్
మార్చి రాజకీయం చేస్తోన్న షర్మిల
కాంగ్రెస్
పార్టీలో వైఎస్సార్ టీపీ విలీనం వెనుక రహస్య ఎజెండా ఉందా? తోబుట్టువు, వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్
మోహన్ రెడ్డి తో ఆమెకు నిజంగా విభేదాలు ఉన్నాయా? కాంగ్రెస్లో వైఎస్సార్ గారాలపట్టి చేరడంతో ఆంధ్ర రాజకీయ
ముఖచిత్రంలో ఆ పార్టీ మళ్లీ పుంజుకునే అవకాశం ఉందా ?
తెలంగాణ
రాజకీయాల్లో వైఎస్సార్ టీపీ వ్యవహారం మూణ్ణాళ్ళ ముచ్చటగానే మిగిలిపోయింది. ఆ
పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ కేంద్రంగా జరిగిన పాదయాత్రలు, ఆందోళనలకు ప్రజామద్దతు ఏ
మాత్రం లభించలేదు. ఆ పార్టీ రాకను తెలంగాణ ప్రజలు ఏ మాత్రం స్వాగతించలేదు. తాను
తెలంగాణ కోడలినంటూ ఆమె ఎన్ని ప్రకటనలు చేసినా తెలంగాణ ప్రజల నుంచి ఆమెకు ఆశించిన
స్థాయిలో రాజకీయమద్దతు దక్కలేదు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచే అవకాశం
లేకపోవడంతో పోటీ నుంచి తప్పుకుని కాంగ్రెస్ కు మద్దతు పలికారు. కేసీఆర్ ను
ఓడించడమే లక్ష్యంగా బేషరతుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు. ఇప్పుడు ఆమె తన
పార్టీని ఏకంగా కాంగ్రెస్ లో విలీనం చేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల రాజకీయ అంకంలో
ఊహించని పరిణామం ఏర్పడింది.
తోబుట్టువుతో
ఆర్థిక తగాదాల కారణంగా తెలంగాణ కేంద్రంగా రాజకీయపార్టీ ని ప్రారంభించిందనే
విమర్శలకు ఆమె నుంచి అప్పట్లో తగిన జవాబు దొరకలేదు. తన తండ్రి దివంగత సీఎం వైఎస్
మార్క్ పాలన అందిస్తామని చెప్పిన రాజశేఖర్ రెడ్డి గారాలపట్టి షర్మిల ఇప్పుడు తన రాజకీయ
గమ్యాన్ని మార్చుకున్నట్లు తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే తన తండ్రి
సంకల్పం నెరవేర్చేందుకు కృషి చేస్తానని తాజాగా ప్రకటించారు.
కాంగ్రెస్
హైకమాండ్ ఆదేశిస్తే దేశంలో ఎక్కడైనా పార్టీ బలోపేతానికి పనిచేస్తానని చెప్పారు. ఆమె కాంగ్రెస్
లో చేరతారనే వార్తలు అధికారికంగా వెలువడక ముందు పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు గోడ
దూకేందుకు సిద్ధమయ్యారు. వైసీపీ లో ఈ సారి సీటు దక్కే అవకాశంలేని ఎమ్మెల్యేలు
కాంగ్రెస్ నుంచి పోటీచేసేందుకు సన్నాహాలు ప్రారంభించారు.
అన్నతో నిజంగా విభేదాలు
ఉన్నాయా లేదా
ఇంకా
జగనన్న వదిలిన బాణమేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి.
పాలక
వైసీపీ పై వ్యక్తం అవుతున్న ప్రజావ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ పేరిట చీల్చి మళ్ళీ
తన అన్నకు మేలు చేయబోతున్నారా అనే ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పేవారు కరవయ్యారు.
వైఎస్సార్టీపీ
ఆవిర్భావం సందర్భంగా తాను తెలంగాణ కోడలినని ఆమె పదే పదే చెప్పుకున్నారు. కానీ ఆమె
తెలంగాణ ప్రజలు ఆదరించలేదు. తెలంగాణ ఏర్పాటును గతంలో ఆమె సమర్థించకపోవడం ఆమెకు
ఆదరణ దక్కకపోవడాని ఓ కారణమైతే అక్కడ రాజకీయ శూన్యత లేకపోవడం మరో కీలక అంశం.
షర్మిల
భర్త బ్రదర్ అనిల్ క్రైస్తవ మత ప్రచారకుడు. ఆంధ్రాలోని క్రైస్తవ ఓట్లతో పాటు వైఎస్
అభిమానులు కూడా మళ్ళీ కాంగ్రెస్ తో కలిసినడిచే అవకాశముంది. ఈ వర్గాలన్నీ ఇప్పటి
వరకు వైసీపీతో ఉన్నాయి.
కాంగ్రెస్
మాత్రమే దేశంలో అతిపెద్ద సెక్యులర్ పార్టీ అని కీర్తించిన షర్మిల, మణిపూర్ అల్లర్ల
అంశాన్ని ప్రస్తావించారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోవడం వల్లనే మణిపూర్ లో చర్చిల ధ్వంసం జరిగిందని ఆమె
వ్యాఖ్యలు చేశారు.
తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవ ఓటు బ్యాంకు(దళిత క్రైస్తవులు)ను
బీజేపీ కి దూరం చేసేందుకే కాంగ్రెస్ ఆమెతో ఈ ప్రకటన చేయించిదనే విశ్లేషణలు కూడా
ఉన్నాయి. రెండు తెగల మధ్య జరిగిన అల్లర్లను బీజేపీకి ముడిపెట్టి మాట్లాడటాన్నితప్పుబడుతున్నారు.
తెలంగాణ
అసెంబ్లీ ఎన్నికల్లో మాదిగ రిజర్వేషన్
పోరాట సమితి బీజేపీకి మద్దతు ప్రకటించింది. లోక్ సభ ఎన్నికల్లో మంద కృష్ణ మాదిగ
బీజేపీ తరఫున పోటీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కిషన్ రెడ్డి కూడా
ప్రకటించారు.