దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో (stock markets) మెరిసిపోయాయి. వరుస నష్టాలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో పాటు, దేశీయంగానూ అనుకూల వాతావరణంతో పెట్టుబడిదారులు స్టాక్స్ కొనుగోళ్లకు మొగ్గుచూపారు. త్రైమాసిక ఫలితాలు సానుకూలంగా ఉంటాయనే అంచనాలు స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులకు ఊతమిచ్చాయి.
సెన్సెక్స్ 490 (sensex) పాయింట్లుపైగా లాభపడి చివరకు 71847 వద్ద ముగిసింది. నిఫ్టీ 141 పాయింట్లు పెరిగింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.22 వద్ద ముగిసింది. రియాల్టీరంగం భారీ లాభాలను ఆర్జించింది. ఈ రంగం షేర్లు 6.6 శాతం పెరిగాయి. విద్యుత్ రంగంలోని స్టాక్స్ కూడా 2 శాతం పైగా పెరిగాయి.
బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, హెల్త్ కేర్, ఆయిల్, గ్యాస్ రంగాల సూచీలు స్వలంగా లాభాలను ఆర్జించాయి. నిఫ్టీలో టాటా కన్జ్యూమర్, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్ షేర్లు రాణించాయి. ఎల్టిఐ, మైండ్ ట్రీ, డాక్టర్ రెడ్డీస్, భారత్ పెట్రోలియం, హెచ్సీఎల్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.