వివిధ దేశాల్లో నెలకొన్న పరిస్థితులపై విదేశాంగ మంత్రి జై శంకర్ (foreign affairs) ఆందోళన వ్యక్తం చేశారు. 2024లో అనేక దేశాల్లో పరిస్థితులు కల్లోలంగానే ఉండొచ్చని, ఢిల్లీలో జరిగిన వై భారత్ మ్యాటర్స్ అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు.కల్లోలాలను ఎదుర్కొనేందుకు భారత్ రాజకీయంగా, ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పటి ప్రధాని నెహ్రూ దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చి ఉంటే, చైనాతో సంబంధాలపై ఆశలు పెంచుకుని ఉండేవారు కాదని ఆయన వ్యాఖ్యానించారు. సర్థార్ వల్లభ్‌బాయ్ పటేల్ నెహ్రూల మధ్య నడిచిన లేఖల్లోనే భిన్నాభిప్రాయాలున్నట్లు తెలుస్తోందని జైశంకర్ అభిప్రాయపడ్డారు.
ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో చైనాకు శాశ్వత సభ్యత్వం లభించేలా మాజీ ప్రధాని నెహ్రూ అనుసరించిన విధానాన్ని జైశంకర్ తప్పుపట్టారు. 1962 యుద్ధంలో అమెరికా మద్దతు తీసుకునేందుకు మాజీ ప్రధాని నెహ్రూ సంకోచించారని ఆరోపించారు. సర్ధార్ వల్లభ్ బాయ్ పటేల్ స్పందన ఇందుకు భిన్నంగా ఉందన్నారు. చైనా అమెరికా బంధాలను కాకుండా, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చూడాలని పటేల్ అభిప్రాయపడినట్లుగా ఉందని అప్పటి లేఖల ద్వారా తెలుస్తోందన్నారు.