Features of Ram Mandir
అయోధ్యలో బాలరాముడి మందిర ప్రాణ ప్రతిష్ఠ
తేదీ దగ్గర (Consecration ceremony)
పడుతోంది. ఆ నేపథ్యంలో ఆలయం విశేషాలను
శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. (Ram Temple at Ayodhya)
మందిర నిర్మాణం ఉత్తరభారత సంప్రదాయిక
నాగర శైలిలో జరుగుతోంది. ఆలయం తూర్పు పడమరలుగా 380 అడుగుల పొడవు, 250 అడుగుల
వెడల్పు, 161 అడుగుల ఎత్తు ఉంటుంది. గుడి మొత్తం మూడు అంతస్తులుగా ఉంటుంది. ఒక్కో
అంతస్తూ 20 అడుగుల ఎత్తుంటుంది. మొత్తం 392 స్తంభాలూ, 44 ద్వారాలూ ఉంటాయి. స్తంభాల
మీద అందమైన డిజైన్లు, గోడల మీద రకరకాల శిల్పాలూ ఉంటాయి.
గర్భగృహంలో బాలరాముడి మూర్తిని (Ram Lalla idol) ప్రతిష్ఠిస్తారు. అయోధ్య రాముడు జన్మించిన భూమి, ఈ ఆలయం నిర్మిస్తున్న
ప్రదేశం రాముడు జన్మించిన స్థలం కాబట్టి ఇక్కడ బాలరాముడి విగ్రహాన్నే ఏర్పాటు
చేస్తున్నారు. ఇక మొదటి అంతస్తులో శ్రీరామ దర్బారు మొత్తం తీర్చిదిద్దుతున్నారు.
మందిరంలో మొత్తం ఐదు మండపాలు ఉంటాయి.
నృత్య మండపం, రంగ మండపం, సభామండపం, ప్రార్థనా మండపం, కీర్తనా మండపం అనే ఆ ఐదు
మండపాల్లోనూ ఆయా పేర్లకు తగినట్లు కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఆలయం గోడల మీద,
స్తంభాల మీద దేవీదేవతల విగ్రహాలు శోభిల్లుతాయి.
గుడిలోకి ప్రవేశం తూర్పువైపు నుంచి
ఉంటుంది. 32 మెట్లు ఎక్కి సింహద్వారం గుండా లోపలికి చేరుకోవాలి. వృద్ధులు,
దివ్యాంగుల కోసం ర్యాంప్‌లు, లిఫ్ట్‌లు కూడా ఏర్పాటు చేసారు. (Ramps and lifts for the aged and differently abled)
ఆలయం చుట్టూ దీర్ఘచతురస్రాకారంలో ప్రహరీ
ఉంటుంది. దాని పొడవు 732 మీటర్లు, వెడల్పు 14 అడుగులు. ప్రహరీ నాలుగు మూలల్లోనూ
నాలుగు గుడులుంటాయి. సూర్యుడు, అమ్మవారు, గణపతి, శివుడు ఆ ఆలయాల్లో కొలువై ఉంటారు.
గుడికి ఉత్తరాన అన్నపూర్ణాదేవి ఆలయం, దక్షిణాన హనుమంతుడి మందిరం ఉంటాయి.
ఈ మందిరానికి చేరువలోనే సీతాకూప్ పేరిట
ప్రాచీన కాలానికి చెందిన చారిత్రకమైన బావి ఉంది. రామమందిర ఆలయ సముదాయంలో వాల్మీకి,
వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్త్య మహర్షులకు, నిషాద రాజు గుహుడికి, శబరీ మాతకు, అహల్యా
దేవికి కూడా మందిరాలు నిర్మిస్తారు.
(Temples for major Ramayan characters)
ఆలయ సముదాయానికి నైఋతి భాగంలో కుబేర తిల
వద్ద మహాదేవుడి ప్రాచీన మందిరం ఉండేది, దాన్ని పునరుద్ధరించారు. అక్కడ జటాయువు విగ్రహాన్ని
కూడా ప్రతిష్ఠించారు. మందిర నిర్మాణంలో ఎక్కడా ఇనుము వాడనే లేదు. నేల చెమ్మ నుంచి
తట్టుకోడానికి నేలమట్టం నుంచి 21 అడుగుల ఎత్తు వరకూ గ్రానైట్ పోసారు. గుడి
పునాదులు రోలర్ కాంపాక్టెడ్ కాంక్రీట్‌తో 14 మీటర్ల పోత పోసారు. దాన్ని చూస్తే ఏదో
కృత్రిమంగా తయారు చేసన రాతిలా అనిపిస్తుంది.
ఆలయ సముదాయంలో వ్యర్థాల నిర్వహణ ప్లాంట్,
వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, అగ్నిప్రమాదాల నివారణకు నీటి సరఫరా వ్యవస్థ,
విద్యుత్ కోసం ప్రత్యేక పవర్ స్టేషన్ ఉన్నాయి. ఇంకా యాత్రికుల సౌకర్యార్ధం 25వేల
మందికి సరిపోయే ఒక పిలిగ్రిమ్ ఫెసిలిటీ సెంటర్ (Pilgrim Facility Center) నిర్మాణంలో ఉంది. అక్కడ భక్తులకు వైద్య సౌకర్యాలు, లాకర్ ఫెసిలిటీ
అందుబాటులో ఉంటాయి. ఇంకా అక్కడ స్నానపానాలకు కూడా ఏర్పాట్లు ఉంటాయి.
బాలరాముడి మందిరం మొత్తాన్నీ పూర్తిగా
భారతీయ సంప్రదాయిక, దేశీయ సాంకేతికతలను ఉపయోగించి నిర్మిస్తున్నారు. జల సంరక్షణకు
ప్రాధాన్యత ఇస్తూ, మొత్తం 70 ఎకరాల విస్తీర్ణంలో 70శాతం ప్రాంతం సతతహరితంగా ఉండేలా
ప్రణాళిక రూపొందించారు.