అన్నపూర్ణగా
పేరున్న ఆంధ్రప్రదేశ్‌ను పాలక వైసీపీ అధ్వాన్న ప్రదేశ్ గా మార్చిందని బీజేపీ
ఆరోపించింది జగన్ ప్రభుత్వం సృష్టించిన ఆర్థిక ప్రళయప్రభావం రాష్ట్రంపై మరో 25
ఏళ్ళు ఉంటుందని అంచనా వేసింది. విజయవాడలో జరిగిన పదాధికారుల సమావేశంలో పలు కీలక
తీర్మానాలు చేసింది. బీజేపీకి అధికారం ఇవ్వాలని
ఆంధ్రప్రదేశ్ ప్రజలను
అభ్యర్థించింది.
1)
ఆర్థిక బీభత్సం : వైసీపీ
ప్రభుత్వ పాలన వైఫల్యంతో రాష్ట్రంలో ప్రతీ పౌరుడిపై సగటున 2.50 లక్షల అప్పు భారం
ఉందని, ఇది రాష్ట్ర భవిష్యత్ ను అంధకారం చేస్తోందని బీజేపీ ఆందోళన వ్యక్తం చేసింది.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం
విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మొదటి తీర్మానం చేసింది. రాష్ట్రప్రభుత్వ ఆర్థిక
నిర్వహణ, ప్రజల భవిష్యత్ కు శరాఘాతంగా మారడం శోచనీయమని పేర్కొంది.
2)మౌలిక సదుపాయాల కల్పనలో ఏపీ అధమం: రాష్ట్ర
పరిధిలోని జాతీయ రహదారులను కేంద్రం అద్భుతంగా నిర్వహిస్తుంటే , రాష్ట్ర ప్రభుత్వం
పరిధిలోని రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని రెండో తీర్మానంలో పేర్కొంది. ముఖ్యమంత్రి
కేవలం సమీక్షలతో కాలం వెలిబుచ్చారని దుయ్యబట్టిన బీజేపీ మిగిలిన రాష్ట్రాల బడ్జెట్‌తో
పోల్చుకుంటే రహదారుల నిర్మాణానికి వైసీపీ ప్రభుత్వం కేటాయించిన నిధులు కేవలం 1.3
శాతమేనని ఎద్దేవా చేసింది.
3) పంచాయతీల హక్కుల హననం :
పంచాయతీల అభివృద్ధికి కేంద్రప్రభుత్వం
కేటాయించిన నిధులను జగన్ ప్రభుత్వం దారి మళ్ళించిందని బీజేపీ రాష్ట్ర శాఖ
ఆరోపించింది. ఈ మేరకు మూడో తీర్మానం చేసింది. రాజ్యాంగ సవరణలు 73,74కు అనుగుణంగా
స్థానిక సంస్థలకు అధికారాల బదలాయింపు జరగాలని డిమాండ్ చేసింది. కేంద్రప్రభుత్వం
కేటాయించిన దాదాపు రూ. 9 వేల కోట్ల నిధులు దారి మళ్ళించడం దారుణమంది.
4) ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్ ప్లాన్ నిధుల దారిమళ్ళింపు:
వైసీపీ పాలనలో మొదటి నాలుగేళ్ళలో ఎస్సీ
సబ్ ప్లాన్ నిధులు బడ్జెట్ లో రూ. 1,02, 700 కోట్లు కేటాయించి, అందులో రూ. 60 వేల కోట్లు కోత
విధించిన అంశాన్ని నాలుగో తీర్మానంలో ప్రస్తావించింది. ‘నా ఎస్టీలు, నా ఎస్సీలు’
అంటూ వారినే సీఎం మోసం చేశారని విమర్శించింది. ఎస్సీ, ఎస్టీలను మోసం చేసిన ముఖ్యమంత్రిగా జగన్
నిలిచిపోయారన్నారు. ఆయా వర్గాలకు అందాల్సిన నిధులు దారి మళ్లించినందుకు ప్రభుత్వం వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్
చేసింది.
5)
రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు లేవు-యువతకు ఉపాధి లేదు : వైసీపీ ప్రభుత్వ పాలన నిర్ణయాలు,
ప్రభుత్వ ప్రోద్బలంతో జరుగుతున్న దాడులు పారిశ్రామిక ప్రగతికి ప్రతికూలంగా మారాయని
ఐదో తీర్మానం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ
అస్తవ్యస్త విధానాల కారణంగా ఆంధ్రప్రదేశ్ లక్ష కోట్లు పెట్టుబడులు కోల్పోవడంతో
పాటు ఆరు లక్షల మంది ఉపాధి కోల్పోయారని వివరించింది.
6)
రాజధాని అమరావతి: రాజధాని అంశాన్ని ఆరో తీర్మానంలో
ప్రస్తావించిన ఏపీ బీజేపీ, స్మార్ట్ సిటీ, హెరిటేజ్ సిటీగా అమరావతిని కేంద్రం
గుర్తించి నిధులు విడుదల చేసిన అంశాన్ని గుర్తు చేసింది. రాజధాని నిర్మాణాన్ని రాష్ట్రప్రభుత్వం
నిర్వీర్యం చేయడంతో పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ వైపు చూసేందుకు
భయపడుతున్నారన్నారు.
7)
అస్మదీయుల కోసం భూదోపిడి: సీఎం జగన్ అస్మదీయులకు ప్రభుత్వ భూమిని దారాదత్తం
చేయడాన్ని ఏడో తీర్మానంలో ప్రస్తావించింది. అర్హత ఉన్న పారిశ్రామికవేత్తలకు లక్ష ఎకరాలు
ఇవ్వలేని జగన్ ప్రభుత్వం, తన జేబు సంస్థలకు 2.50లక్షలు కేటాయించడం సిగ్గు చేటు అని
విమర్శించింది.
8) రాష్ట్రంలో కరవు పరిస్థితి: రాష్ట్రంలో
400కు పైగా మండలాల్లో కరువు పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని
ఎనిమిదో తీర్మానంలో పేర్కింది. రైతుల సమస్యల గురించి కేబినెట్ లోచర్చించకపోవడం బాధాకరమంది.
9) నీటి ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయకపోవడం, నాణ్యమైన విత్తనాలు,
ఎరువులు సకాలంలో అందక పోవడంతో రైతులు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుపోయారని అందుకే
ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వెల్లడించింది. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో
ఉందంటే ప్రభుత్వం నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అని తెలిపింది.
బీజేపీకి
రాష్ట్రంలో అధికారమిస్తే అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రగతి పథంలో నడిపిస్తామని
హామీ ఇచ్చింది. మోదీ పాలనలో దేశం అన్ని
రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందన్న ఏపీ బీజేపీ, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్
రావాల్సిన సమయం ఆసన్నమైందని ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరింది.