అయోధ్యలో రామాలయం ప్రతిష్ఠాపనకు సిద్దం అవుతున్న వేళ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత జితేంద్ర అవద్, రాముడు మాంసాహారి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.రాముడు బీసీలకు చెందిన వాడు. అతను అరణ్యవాసం సమయంలో జంతువులను వేటాడి తినేవాడంటూ బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో అవద్
చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్రలో పెద్ద దుమారం రేపాయి. రాముడిని చూపించి, ప్రతి ఒక్కరినీ శాఖాహారులుగా మార్చాలని చూస్తున్నారని జితేంద్ర బీజేపీ నేతలనుద్దేశించి వ్యాఖ్యానించారు. వనవాసం చేసిన వ్యక్తికి అడవుల్లో శాఖాహారం ఎక్కడి నుంచి వచ్చింది. రాముడు మాంసాహారి అంటూ జితేంద్ర ప్రస్తావించారు.
జితేంద్ర వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీశాయని, అతనిపై చర్యలు తీసుకోవాలంటూ ముంబైలో కొందరు ఆందోళన చేపట్టారు. బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ నేతృత్వంలో నిరసనకారులు జితేంద్రపై సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జితేంద్ర ఇంటి ముందు ఆందోళన చేశారు. దీంతో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు. బాలాసాహెబ్ బతికి ఉంటే ఇలాంటి వ్యాఖ్యలు సామ్నాలో వచ్చేవి కావని, ఇవాళ రాముడి గురించి, హిందువుల గురించి ఎన్సీపీలో ప్రతి ఒక్కరూ ఎగతాళి చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే కదమ్ విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ హిందుత్వ గురించి మాట్లాడుతున్నారని కదమ్ ఎద్దేవా చేశారు.
రాముడిపై వ్యాఖ్యలు చేయడంతోనే ఎన్సీపీ నేత జితేంద్ర ఆగలేదు. గాంధీ, నెహ్రూల వల్లే స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. గాంధీపై 1947లో మాత్రమే హత్య జరగలేదని, ఆయనపై 1935లో మొదటిసారి, 1938లో రెండోసారి, 1942లో మూడోసారి హత్యాయత్నాలు జరిగాయని గుర్తుచేశారు. గాంధీజీ వెనుకబడిన బీసీ కులాలకు చెందిన వ్యక్తి కావడం వల్లే ఇలా జరిగిందని, దీన్ని ఆర్ఎస్ఎస్ అంగీకరించదని జితేంద్ర చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.