AYODHYAUPDATES
అయోధ్య భవ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట
సందర్భంగా కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తుల రాకతో అయోధ్య
నగరం ఆధ్యాత్మిక శోభతో పరిఢవిల్లుతోంది. రామనామస్మరణతో మార్మోగుతున్న శ్రీరాముడి
జన్మస్థలిలో జనవరి 22న రామ్‌లల్లా విగ్రహ
ప్రతిష్టా కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి.
జనవరి 22న రామ్‌ఘాట్‌లోని
తులసిబారి వద్ద ఈ అతిపెద్ద దీపాన్ని వెలిగించి సనాతన
సంప్రదాయాన్ని
మరోసారి ప్రపంచానికి చాటిచెప్పబోతున్నారు.
28
మీటర్ల వ్యాసం కలిగిన దీపాన్ని వెలిగించేందుకు 21 క్వింటాళ్ళ నూనె అవసరమవుతోంది. ఈ
దీపం ఘనతను గిన్నిస్ బుక్ లోకి ఎక్కించే సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. ఈ
క్రతువుకు దశరథ్ దీప్‌గా నామకరణం చేసిన ఆలయ ట్రస్ట్, దీపపాత్ర తయారీకి
పుణ్యక్షేత్రాల్లోని మట్టితో పాటు నదులు, సముద్రాల నుంచి పుణ్య జలాలు సేకరించారు.
త్రేతాయుగం
నాటి దీపం ఆకారాన్ని సిద్ధం చేస్తోన్నట్లు తపస్వి కంటోన్మెంట్ కు చెందిన స్వామి పరమహంస
తెలిపారు. ఇందుకోసం పురాణాలను అధ్యయనం చేసినట్లు వివరించారు.
దీపం
తయారీ కోసం 108 మంది కళాకారులు శ్రమిస్తోండగా, రూ. 7 కోట్ల బడ్జెట్ వెచ్చించారు.
దీపం వత్తి తయారీకి 1.25 క్వింటాళ్ళ పత్తిని కూడా సిద్ధం చేశారు.
భక్తులకు
ఏలకుల(ఇలాచీదానా) ప్రసాదం అందజేయాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు
నిర్ణయించింది. రామ్ విలాస్ అండ్ సన్స్ దుకాణానికి ప్రసాదం తయారీ బాధ్యతలు
అప్పగించారు. జనవరి 22 లోపే 5లక్షల ప్రసాదం ప్యాకెట్లు అందజేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు
దుకాణ యాజమాన్యం తెలిపింది.
రామ్‌లల్లా
విగ్రహ ప్రాణప్రతిష్ట సందర్భంగా అయోధ్యలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు.
ఇందులో భాగంగా భోపాల్ కు చెందిన డమరూ బృందం కూడా తమ ప్రదర్శనతో భక్తులను
తన్మయత్వానికి గురిచేయనుంది. శ్రీబాబా
బటేశ్వర్ కీర్తన సమితికి ట్రస్ట్ నుంచి ఆహ్వానం అందింది. రామభజన, రామస్తుతి, శివ
తాండవ స్తోత్రం పఠించే ఏకైక బృందంగా ఈ కళా బృందానికి పేరుంది.