వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (ys sharmila delhi tour) కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, షర్మిలకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. నిన్న సాయంత్రం విజయవాడ నుంచి నేరుగా ఢిల్లీ చేరుకున్న షర్మిల, గురువారం ఉదయం కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. భర్త అనిల్ సహా ఆమె ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్లో విలీనం అయినట్టు గానే భావించాల్సి ఉంటుంది.
షర్మిలకు కాంగ్రెస్ అధిష్ఠానం ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తుందనే విషయంలో మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవి అప్పగిస్తారా, ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది. రాబోయే రెండు వారాల్లో దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.