కోట్లాది మంది హిందువులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తోన్న అయోధ్యలో రామాలయం నిర్మాణం సాకారమైన వేళ, మందిరం పేల్చేస్తామంటూ వచ్చిన బెదిరింపులు ఆందోళన కలిగిస్తున్నాయి. రామమందిరం సహా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తామంటూ కొన్ని బెదిరింపులు సోషల్ మీడియాలో కలకలం రేపాయి. కొద్ది రోజుల్లో రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ జరగనున్న నేపథ్యంలో వచ్చిన బెదిరింపులు కలకలం రేపాయి.
బెదిరింపుల వ్యవహారంలో యూపీ పోలీసులు ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేశారు. నిందితులిద్దరూ సోషల్ మీడియా ద్వారా బెదిరింపులకు పాల్పడినట్లు తేలింది. యూపీ సీఎం సహా, ఎస్టీఎఫ్ చీఫ్ అమితాబ్ యశ్‌ను లేపాస్తామంటూ బెదిరింపులకు దిగారు. అప్రమత్తమైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు ఎక్కడ నుంచి పోస్టులు పెట్టారో గుర్తించారు. నిందితులు ఓం ప్రకాశ్, తాహర్ సింగ్‌లుగా గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. గోండాలోని పారామెడికల్ సంస్థలో వీరు పనిచేస్తున్నట్లు తేలింది.