Sabarimala prepares for the
auspicious Makaravilakku
శబరిమలకు అయ్యప్పమాలధారులు, భక్తులు పెద్ద ఎత్తున
చేరుకోవడంతో స్వామి దర్శనం కోసం క్యూ లైన్లో 12 గంటల పాటు వేచి చూడాల్సి
వస్తోంది.
పంబా
నుంచి శబరిపీఠం వరకు ఉన్న ప్రాంతమంతా భక్తులతో నిండిపోయింది. గంటల తరబడి భక్తులు
క్యూలైన్ లో వేచి ఉండాల్సి వస్తోందని తిరువాన్కూర్ దేవస్థానం బోర్డు తెలిపింది. భక్తుల రద్దీ దృష్ట్యా మకరజ్యోతి
దర్శనాలపై కొత్త నిబంధనలు విధిస్తున్నట్లు తెలిపింది.
మకరజ్యోతి
వీక్షణం కోసం 50 వేల మందినే అనుమతిస్తున్నామని పేర్కొన్న ట్రస్ట్, పిల్లలు, మహిళలు
జ్యోతి దర్శనానికి రావద్దని సూచించింది. భక్తుల రద్దీ దృష్ట్యానే ఈ నిర్ణయం
తీసుకోవాల్సి వచ్చిందని ఓ ప్రకటనలో వివరణ
ఇచ్చింది. ఈ నెల 14న 40 వేల మందికి, 15న 50 వేలమందికి మాత్రమే అనుమతిస్తున్నట్లు
వెల్లడించింది. అది కూడా ఆన్లైన్ లో బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే దర్శనభాగ్యం
ఉంటుందని తేల్చి చెప్పింది.
జనవరి పది నుంచి స్పాట్ బుకింగ్ నిలిపివేస్తున్నారు. జనవరి
13, 14 తేదీల్లో ప్రసాద శుద్ధ క్రియ, బింబ శుద్ధ క్రియ క్రతువులు
నిర్వహించనున్నారు. మకరవిళక్కు ను జనవరి 15న నిర్వహిస్తారు. మకరవిళక్కు రోజు స్వామివారికి
తిరువాభరణాలు అలకంరిచడం ఆనవాయితీగా వస్తోంది. జనవరి 20 వరకు మణికంఠుడి ఆలయం తెరిచి
ఉంటుంది.
భక్తుల
రద్దీకి తగ్గట్లుగా ఏర్పాట్లు చేయడంలో కేరళ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పలువురు
విమర్శిస్తున్నారు. టాయిలెట్ల లాంటి కనీస సౌకర్యాలు లేక భక్తులు నానా యాతన పడుతున్నారని
సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శబరిమలలో అయ్యప్ప దీక్షాధారులు
ఎదుర్కొంటున్న సమస్యలపై కేరళ సీఎంవో ఇప్పటికైనా దృష్టి పెట్టాలని కోరుతున్నారు.
గతంతో
పోల్చుకుంటే ఏడాది శబరిమల అయ్యప్ప స్వామి
ఆదాయం పెరిగింది. నవంబర్ 17 నుంచి డిసెంబర్ 27 వరకు 40 రోజుల్లోనే దాదాపు 32 లక్షల
మంది స్వామిని దర్శించుకోగా, రూ. 241 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. గత ఏడాది కంటే
సుమారు రూ. 18 కోట్లు ఎక్కువ.