బాంబు పేలుళ్లతో ఇరాన్ దద్దరిల్లింది. జంట పేలుళ్లతో ఇరాన్లో మృతుల సంఖ్య 103కు చేరింది. 108 మంది గాయపడ్డారు. నాలుగేళ్ల కిందట అమెరికా దాడిలో చనిపోయిన ఇరాన్ జనరల్ సులేమానీ సమాధి వద్ద నివాళులర్పించేందుకు బుధవారంనాడు జనం వేలాదిగా తరలివచ్చిన సమయంలో బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఇరాన్‌లోని కెర్మన్ పట్టణంలో ఈ పేలుళ్లు జరిగాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు 820 కి.మీ దూరంలో ఈ నగరం ఉంది.
పేలుళ్లపై ఏ సంస్థా స్పందించలేదు. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం నేపథ్యంలో ఆ ప్రాంతంలో పరిస్థితులు ఉద్రిక్తగా మారాయి. ఇలాంటి సమయంలో ఇరాన్లో జరిగిన భారీ పేలుడు ఆందోళన కలిగిస్తోంది. 15 నిమిషాల వ్యవధిలో రెండు బాంబులు పేలాయని స్థానిక మీడియా ద్వారా తెలుస్తోంది. ఉగ్రదాడులను కెర్మన్ ఉప గవర్నర్ రహ్మాన్ జలాయ్ ఖండించారు. ఈ బాంబుదాడులు ఉగ్ర సంస్థలు, విదేశీ శక్తుల పనిగా భావిస్తున్నారు. లెబనాన్ దేశానికి చెందిన హెజ్బొట్లా, యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారుల పనిగా అనుమానిస్తున్నారు.