ధనుర్మాస ప్రత్యేక కథాస్రవంతి : 18
మంచి వెన్నెల వేళ :: గురివింద పొదలందు
పలికేను గోరింక! మేలుకో! ~ కాత్యాయనీ వ్రతం – 18
రచన : ‘కొత్తావకాయ’ సుస్మిత
**************************
నందగోపుని మందిరపు మొగసాల నిలిచిన
గోపకాంతలు పులు కడిగిన మాణిక్యాల వలె ప్రకాశిస్తున్నారు. యమునలో స్నానమాడి, కాత్యాయనికి పూజ
చేసి, రయమున రాజమందిరానికి వచ్చి నిలచారు. శుక్లపక్ష చంద్రుడు తోడున్నానని
హామీ ఇచ్చి ముందుకెళ్ళమన్నట్టు నవ్వుతున్నాడు. ద్వారపాలకుని ధైర్యవచనాలు నెమరు
వేసుకుంటూ, బలదేవుడు చెప్పినట్టు నేరుగా నీలా మందిరం వైపు నడవనారంభించారు.
“సురభీ! నీలాదేవి మందిరం ఎంత వైభోగంగా ఉంది! ఇంద్రభవనానికైనా వంక
పెట్టవచ్చేమో కానీ ఈ మందిరానికి మచ్చలేదు కదా! ఆ తటాకాలు, పూలతోటలూ చూస్తేనే
కళ్ళు చెదిరిపోతున్నాయి. ఈ మణిఖచిత వేదిక మీద నీలా కృష్ణులు కూర్చుని ఉంటారా? ఈ బంగారు
తూగుటూయలలో కన్నయ్య ఊగి ఉంటాడా? ఏం భోగం! ఏం ఐశ్వర్యం! ఈ గాలిలోనే ఏమి దివ్య పరిమళం? అసలు ఈ భవనాన్ని
విడిచి బృందావనిలో చెట్ల కింద, అరుగుల మీద, యమున ఒడ్డున ఇసుక తిన్నెలమీద మనతో కృష్ణుడు కలిసి ఆడి
పాడాడంటే నమ్మశక్యంగా లేదు! ఎంత అదృష్టవంతులం మనం!” ఆశ్చర్యపోయింది తరళ.
“సాక్షాత్తూ యశోద మేనకోడలు నీల! ఆగర్భ
శ్రీమంతురాలు. కోరి వలచి, ఉంకువ చెల్లించి కృష్ణుడు పరిణయమాడిన మామ కూతురు. ఈ వైభోగం ఆమెకు
పుట్టుకతో వచ్చినదే!” చెప్పింది సురభి.
“ఏవిటేవిటీ!! ఉంకువ చెల్లించాడా? అంత పుట్టు
శ్రీమంతురాలంటున్నావు? ఇంకా శుల్కమెందుకు?”
“వెర్రి దానా! కృష్ణుని పరాక్రమమే ఉంకువ! ధనమో, ఆలమందలో కాదు. తన
బాహుబలమే శుల్కంగా చెల్లించి ఈమెను చేపట్టాడు కృష్ణుడు.” నవ్వింది సురభి.
“అబ్బా.. వివరంగా చెప్దూ!” చుట్టూ గరుడపచ్చలు
పొదిగిన చలువరాతి తిన్నెపై కూర్చుంటూ అడిగింది.
“విదేహ రాష్ట్రంలో గొప్ప శ్రీమంతుడైన గొల్ల ఉండేవాడు. అతని పేరు
కుంభకుడు. అతను యశోదకు అనుంగు తమ్ముడు. తనభార్య ధర్మద తో కలిసి పుణ్యకార్యాలు
చేస్తూ, సొమ్ములు, పాలు, పెరుగూ అడిగినవారికి కాదనకుండా దానం చేస్తూ ఉండేవాడు. కుంభకునికి శ్రీ
ధాముడు, ‘నీల‘ అని ఇద్దరు సంతానం. నీలకే ‘నాగ్నజితి‘ అని మరొక పేరు. పూర్వం తారకాసుర సంగ్రామంలో మహా విష్ణువు చేత చచ్చిన కాలనేమికి
ఏడుగురు కుమారులున్నారు. వారు విష్ణువుపై పగబట్టి కృష్ణుని రూపంలో రేపల్లెలో
పుట్టిన అతనిపై పగ తీర్చుకునేందుకు,
కృష్ణుని మామ కుంభకుని ఇంట భయంకరమైన ఆబోతులుగా పుట్టారు.
“కన్నయ్య ఎప్పుడైనా మేనమామ ఇంటికి రాడా! పగ తీర్చుకోకపోతామా!” అని వారి
ఆలోచన. ఆ ఏడు ఎద్దులూ మహా క్రూరమైనవి. ఒక్కో ఎద్దూ ఏడు ఏనుగులను తుదముట్టించేంత
బలం కలిగి ఉండేది! అవి ఊరిమీద పడి చేస్తున్న ఆగడాలకు కుంభకుడు ముకుతాడు
వెయ్యలేకపోయాడు. వీటి ముట్టె పొగరణచిన వాడికి తన కుమార్తె నీలను ఇచ్చి వివాహం
చేస్తానని చాటింపు వేయించాడు.
“ఊ.. కన్నయ్య వెళ్ళాడా!”
“వెళ్ళడూ మరి! ఆ సౌందర్యరాశి నీల మనసులో తన బావ
కృష్ణుడినే వరించింది. ఆమెను చేపట్టేందుకు మేనమామ ఇంటికి వెళ్ళిన కృష్ణుడు, ఆ భయంకరమైన సప్త
వృషభాలను తన ముష్టి ఘాతాలతో తుదముట్టించి ఆమెను పెళ్ళి చేసుకున్నాడు”
“అవునా! మరి అంత గొప్పింటి పిల్ల మందిరానికి
వెళ్ళి, కృష్ణుడిని బయటకు పంపమంటే ఆమె పంపుతుందా?” నిస్పృహతో
అడిగింది కమలిని.
“ప్రయత్నిద్దాం. మంచిగా ఆమెను వేడుకుందాం.”
“సరే! ద్వారపాలకునికే అన్ని పధ్ధతులున్నాయి కదా!
మరి కృష్ణుని కొంగున కట్టుకున్న ఆ భాగ్యశాలిని ఎలా సంబోధించడం! ఆమెకు దయ కలిగేలా
ఎలా మాట్లాడడం?” సందేహం వెలిబుచ్చింది కమలిని.
“వెర్రి దానా! అమ్మకు ఉన్నదే వాత్సల్యం. సాక్షాత్
లక్ష్మీరూపం నీల! సురుచిరాంగి.. మంచి మనసున్నదీ కూడా! అయితే ఏమని పిలిస్తే
బాగుంటుందో!” సాలోచనగా ఆనందిని వైపు చూస్తూ అంది సురభి.
“ఆ.. ఏముంది. “నందగోపుని మందిర రక్షకా!”
అని పిలిచాం. “నందగృహ దీపమా!” అని యశోదని పిలిచాం. అలాగే
“నందగోపుని కోడలా..!” అంటే సరిపోతుంది.” అల్లరిగా సమాధానం
చెప్పింది తరళ.
“నవ్వులాటకు చెప్పినా సరైన మాట చెప్పావు. అలాగే
పిలవాలి.”నవ్వింది ఆనందిని.
“ఊరుకుందూ! యశోదకి మేనకోడలైతే, “నందుని
కోడలా” అని ఎందుకూ పిలవడం!” అపనమ్మకంగా అడిగింది తరళ.
“మీకు అర్ధమయ్యేలా చెప్పాలంటే రామాయణంలోకి వెళ్ళాలి.” అని నవ్వి
చెప్పనారంభించింది ఆనందిని.
“అశోకవనిలో శోకంలో మునిగి, శింశుపా వృక్షం
కింద కూర్చున్న సీతమ్మ దగ్గరకు వెళ్ళాడు హనుమ. అతనితో తను ఎవరని చెప్పిందో తెలుసా
సీతమ్మ? “స్నుషా దశరథస్యాహం! దశరథుని కోడలిని నేను!” అని చెప్పుకుంది. ఆ తరువాతే జానకినని, ఆ పై రాముని
ఇల్లాలిననీ చెప్పింది.”
“అవునా!”
“ఊ.. అంతే కాదు. రామునికి సీత అంటే ఎందుకంత ఇష్టమో
తెలుసా? “దారా పితృకృతా ఇతీ!” మా తండ్రి అనుమతితో పాణిగ్రహణం చేసానీమెను! “మా నాన్నగారి కోడలు సీత!” అని చెప్పుకున్నాడు రామచంద్రుడు. కనుక
“నందగోపుని కోడలా!” అని పిలిస్తేనే నీల, కృష్ణుడు కూడా
సంతోషిస్తారు.” చెప్పుకొచ్చింది ఆనందిని.
“సరే! అలాగే పిలుద్దాం. పదండి. వెళ్ళి నిద్ర
లేపుదాం.”లేచి మందిర ముఖ ద్వారం వైపు కదిలింది తరళ. వెనుకే మిగిలిన
గోపకాంతలు.
మణికవాటాలకి వ్రేలాడుతున్న పల్చని
తెల్లని జలతారు తెరలు కదులుతున్నాయి. ‘ఏమని పిలవాలో, ఆమె బయటకు వస్తే ఏమని అడగాలో‘ ఒకటికి రెండు సార్లు ముందే అనుకుని
నిర్ణయించుకున్నారు. తలుపు దగ్గరగా నిలబడి నెమ్మదిగా పిలిచింది కమలిని.
“ఓ నందగోపుని కోడలా! నీలా! మేలుకో! మద గజాలనోడించే భుజబలమున్న వాడు నంద
గోపుడు. అతని కోడలివి నువ్వు! కాత్యాయనీ వ్రతానికి కావలసిన వస్తువులు నీ పెనిమిటి
శ్రీకృష్ణుని అడిగి తీసుకెళ్ళాలని వచ్చాం. నువ్వు నిద్ర లేచి కృష్ణుని నిద్ర లేపు.
నీ ముంగిట నిలిచి ఎదురుచూస్తున్నాం. లే నీలా! నిదుర లే!” తన వంతు పిలుపు
అయిపోయిందన్నట్టు వెనక్కి తిరిగి చెలుల వైపు చూసింది కమలిని. ఉత్పల, తరళా
పిలవనారంభించారు.
“నీలా! అదిగో కోళ్ళు కూస్తున్నాయి. తెలవారుతోంది.
సద్భోధలు చేసే జీయరులు నిద్రలేచి హరినామ స్మరణ చేస్తున్నారు. వినిపించిందా? గురివింద పొదల్లో
గొరవంకలు కూస్తున్నాయ్. నీ వద్ద సంగీత పాఠానికి సిధ్ధమై నీ శిష్యురాలు కోకిల వచ్చి
మాధవీ లతపై కూర్చుంది. “కూ.. కూ..” అని నిన్నటి పాఠం వల్లెవేసి నిన్ను
మెప్పించి, నిద్ర లేపాలని చూస్తోంది. మేమూ ఆ కోయిలలాంటి వాళ్ళమే! నీ పలుకుల కోసం
ఎదురుచూస్తున్నాం. నిత్యవసంత శోభతో అలరారే వనలక్ష్మివి నువ్వు! నీకు కాకి కూత ఏదో, కోయిల పాటేదో
తెలియదా? మా పిలుపులో మాధుర్యం, మన్నన నీకు వినిపించలేదా?
మేము అలవికాని కోరికలు కోరే అత్యాశాపరులం కాదు.
వెర్రి గొల్ల పొలతులం. మంచి మాటలు మాట్లాడేవాళ్ళం. మాపై దయ తలచకపోయినా ఆ పికానికి పాట
నేర్పేందుకైనా నిద్ర లేవమ్మా!”
నీల అలసి సొలసి నిద్రపోతోందని
నిశ్చయించుకున్నారందరూ! మళ్ళీ ప్రయత్నిద్దామని పిలవసాగింది సురభి.
“నీలా! ఓ సౌందర్య రాశీ! ఓ అన్నుల మిన్నా! నీ కంటే
గొప్ప అందగత్తె ముల్లోకాలలోనూ ఉందా?
నీ హొయలు మరొకతెకు సాధ్యమయ్యేదేనా? నీ అందాన్ని చూసి
నిన్ను అనుకరించాలని ప్రతి కొమ్మా పూచింది. నీ సొగసు ముందు ఈ పువ్వులు ఓడిపోతున్నాయి! ఈ
పూలని చూస్తే తెలుస్తుంది నీవెంత చక్కదనాల కొమ్మవో! విరగబూసిన ఈ పువ్వులను, కృష్ణుని కోసం
ఎదురుచూస్తూ, నీ ఎర్రని నాజూకైన వేళ్ళతో మాలలు అల్లావు కాబోలు! ఆ మాలలను బంతులుగా
చుట్టి మీరిద్దరూ ఆడుకున్నారేమో! సుమాల కంటే సుకుమారివి! పాపం! బంతులాడి ఆ పూలబంతి
చేతిలో ఉండగానే నిద్రపోయావేమో! నిద్ర లే! నీ నీలాల కురుల నెత్తావి మమ్మల్ని తాకనీ!
లే నీలా! ఓ మధుసూదనప్రియా! నిదుర లే!” అలికిడి లేని ఆ మందిరపు వాకిట నిలచి
నిరాశగా ఒకరినొకరు చూసుకున్నారు వారందరూ!
“నీలా! మహా క్రూరమైన బలమైన ఏడు ఆబోతులను ఓడించి నిన్ను చేపట్టాడు నీ
స్వామి! అతని భుజబలం నీకు తెలియనిది కాదు. మద జలమూరే చెక్కిళ్ళతో అడవిలో విహరించే
ఏనుగు వంటి బాహుబలం కల స్వామి ఆ శ్రీకృష్ణుడు. అతని శరణు కోరి వచ్చాం.
నువ్వు నిద్ర లేచి ఆయనను నిద్ర లేపాలి. ఎర్రని తమ్మి పూవులను పోలిన నీ చేతులకి
ఉండే బంగారు కంకణాల వినసొంపైన ధ్వని మా చెవుల సోకనీ! ఆ పసిడి కంకణాలు కదిలేలా
తలుపు తీయవా?”
నందగోపుని కొడలా! ఓ నీల!
ఎందుకమ్మా తలుపు తీయవు?
విందువా కోళ్ళు కూసేను. ఆ వంక
గురివింద పొదలందు పలికేను గోరింక
కందుకము వేళ్ళ సందిటను కలదాన!
అందమగు కురుల నెత్తావి కలదాన
కుందనపు కంకణాల్ చిందులాడీ పాడ
కెందమ్మి పోలేటి నీ సోగ కేల
సుందరుడు నీ స్వామి శుభనామములను మన
మనమందరమునూ కూడి పాడుకొందాము
క్రందుకొను గంధసింధుర బలముతో వైరి
బృందముల క్రిందుపడ జేయగల వాని
నందగోపుని కోడలా! ఓ నీల!
ఎందుకమ్మా తలుపు తీయవు?
అలికిడి లేదు. తలుపు తెరుచుకోలేదు.
తెలవారింది. “ఇంత పిలచినా నిద్రలేవని నీలాకృష్ణులు ఎంత గాఢనిద్రలో ఉండి
ఉంటారో!” అనుకుంటూ ఇళ్ళకు మరలారు గోపవనితలు. రేపటి రోజున మళ్ళీ వద్దామని
ఒకరిని ఒకరు సముదాయించుకుని వెనుతిరిగారు.
(రేపేం జరుగుతుందో.. ఎదురుచూద్దాం!)
(ఆండాళ్ “తిరుప్పావై” పాశురాలకు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి తేనె తీయని తెనుగు సేత)
(ఆండాళ్
“తిరుప్పావై”, బమ్మెర పోతనామాత్య ప్రణీత
“శ్రీమదాంధ్ర భాగవతము”, పిలకా గణపతి శాస్త్రి
గారి “హరి వంశము” ఆధారంగా.. తగుమాత్రం కల్పన జోడించి..)