కేప్‌టౌన్ వేదికగా భారత్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో సౌతాప్రికా 55 పరుగులకే కుప్పకూలి చెత్త రికార్డును మూటగట్టుకుంది. భారత పేసర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌కు సఫారీలు అల్లాడిపోయారు.
23.2 ఓవర్లలో 55 పరుగులకే వెనుదిరిగారు. బెడింగ్ హామ్ (12), వెరినే(15) మాత్రమే రెండు అంకెల స్కోర్ చేయగల్గారు. చివరి టెస్ట్ ఆడుతున్న డీన్ ఎల్గర్(4), టోనీ జార్జి(2), ట్రిస్టన్(3), మార్కో జాన్సన్(0), కేశవ్ మహరాజ్(3), రబాడ(5), నండ్రే బర్గర్(4) విఫలమయ్యారు. సిరాజ్ ఆరు వికెట్లు తీసి సఫారీలను భయపెట్టగా, బుమ్రా, ముకేశ్ చెరో రెండు వికెట్లు తీసి 55 పరుగులకే పెవిలియన్ కు పంపారు.
మొదటి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తోన్న భారత్ 24 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ ఏడు బంతులు ఆడి డకౌట్ అయ్యాడు. రబాడా బౌలింగ్ లో బౌల్డ్ గా వెనుదిరిగాడు. రోహిత్ శర్మ 50 బంతులు ఆడి 39 పరుగులు చేసి క్యాచ్ ఔట్ గా వెనుదిరిగి అభిమానులను నిరాశపరిచాడు. శుభమన్ గిల్ కూడా 55 బంతుల్లో 36 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. నండ్రే బర్గర్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. శ్రేయస్ అయ్యర్ కూడా డకౌట్ అయ్యాడు. టీ విరామం సమయానికి కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ క్రీజులో ఉన్నారు.
2016లో జోహనెస్బర్గ్ వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో కూడా దక్షిణాఫ్రికా 83 పరుగులకే చేతులెత్తేసింది. 2019లో నాగ్ పూర్ లో భారత్ తో జరిగిన మ్యాచ్ లో కూడా 79 పరుగులకే ఆలౌటైంది. 2021లో ముంబై వేదికగా జరిగిన టెస్ట్ లో న్యూజీలాండ్ 62 పరుగులకే వెనుదిరిగింది.