BJP slams Owaisi on his
‘Masjid’ remark
‘మసీదును కోల్పోయా’మంటూ ఆల్ ఇండియా
మజ్లిస్ ఇత్తేహాద్ ఉల్ ముస్లిమీన్ (AIMIM)
నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ముస్లిములను రెచ్చగొట్టడం ద్వారా
హిందూముస్లిముల మధ్య ఉద్రిక్తతలు పెంచడానికే ఒవైసీ ప్రయత్నిస్తున్నాడని బీజేపీ నాయకుడు
షానవాజ్ హుసేన్ (Shah Nawaz
Hussain) దుయ్యబట్టారు.
‘‘ఒవైసీ పార్టీ ఎంఐఎం ఎప్పుడూ
రెచ్చగొట్టే ప్రకటనలు చేయడాన్నే నమ్ముతుంది. అసలు మసీదును లాక్కున్నది ఎక్కడ?
అలాంటి తప్పుడు ప్రకటనలు ఎందుకు చేస్తున్నాడు?’’ అని షానవాజ్ హుసేన్ ప్రశ్నించారు.
సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకే అయోధ్యలో
రామమందిర నిర్మాణం జరుగుతోందని షానవాజ్ హుసేన్ ఒవైసీకి గుర్తు చేసారు. ‘‘సుప్రీంకోర్టు
నిర్ణయాన్ని ఆమోదిస్తూ ముస్లిం పక్షం కూడా రాతపూర్వకంగా ప్రకటన ఇచ్చింది. ఒవైసీ
మళ్ళీ హిందూ ముస్లిముల మధ్య ఉద్రిక్తతలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాడు. తన
వ్యాఖ్యల ద్వారా ప్రజలను రెచ్చగొడుతున్నాడు’’ అని ఆగ్రహం వ్యక్తం చేసారు.
అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ
కార్యక్రమం దగ్గరపడుతోంది. ఆ సందర్భంగా బీజేపీ నాయకత్వంలోని కేంద్రప్రభుత్వం
కార్యకలాపాలపై ఓ కన్నేసి ఉంచాలంటూ ముస్లిం యువతకు ఒవైసీ సూచించారు. దేశంలోని
మసీదులన్నింటినీ ఎప్పుడూ జనాలతో నిండి ఉండేలా చూడాలని ఆయన సలహా ఇచ్చారు.
ఒవైసీ వ్యాఖ్యలపై విశ్వహిందూ పరిషద్ (Viswa Hindu Parishad) అంతర్జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ (Surendra Jain) కూడా నిరసన వ్యక్తంచేసారు. శ్రీరామజన్మభూమి విషయంలో సుప్రీంకోర్టు
ఇచ్చిన తీర్పును పదేపదే విమర్శిస్తున్న ఒవైసీ పద్ధతి, కోర్టు ధిక్కారం పరిధిలోకి
వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
‘‘ఒవైసీ లాంటి నాయకులకు
నా హెచ్చరిక ఒక్కటే. ముస్లిం ప్రజలను పదేపదే రెచ్చగొట్టవద్దు. అలాంటి నాయకులు
ముస్లిం సమాజాన్ని ఎలాంటి అభివృద్ధీ ఉండని చీకటిలోకి నెట్టేస్తున్నారు’’ అన్నారు
సురేంద్ర జైన్.