Respite for Adani, SC
says no need of SIT probe
అదానీ గ్రూప్‌కు సుప్రీంకోర్టులో భారీ
ఊరట లభించింది. హిండెన్‌బర్గ్ కేసులో సెబి దర్యాప్తును అనుమానించడానికి – ప్రపంచ కుబేరుడు
జార్జ్ సొరోస్ నిధులతో నిర్వహిస్తున్న ఓసీసీఆర్పీ ఇచ్చిన నివేదిక ప్రాతిపదిక
కాబోదని స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై
చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పర్దీవాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం – అదానీ
గ్రూపు సంస్థల కార్యకలాపాలపై దర్యాప్తును సెబి నుంచి స్పెషల్ ఇన్వెస్టిగేషన్
టీమ్-సిట్‌కు బదిలీ చేయాల్సిన అవసరం లేదని – స్పష్టమైన తీర్పునిచ్చింది.
అమెరికా కేంద్రంగా షార్ట్‌సెల్లింగ్
వ్యాపారం చేసే హిండెన్‌బర్గ్ రిసెర్చ్ సంస్థ, అదానీ గ్రూపు సంస్థలపై చేసిన
ఆరోపణలకు సంబంధించి నమోదైన 24 కేసులలో 22 కేసులను సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్
బోర్డ్ ఆఫ్ ఇండియా – సెబి దర్యాప్తు చేసింది. మిగతా 2 కేసులలోనూ దర్యాప్తు పూర్తి
చేయడానికి సెబీకి సుప్రీంకోర్టు 2 నెలల సమయం ఇచ్చింది.
భారతీయ మార్కెట్లో షార్ట్ సెల్లింగ్ చేయడానికి
ఉన్న నియమనిబంధనలను హిండెన్‌బర్గ్ సంస్థ విస్మరించిందా లేదా అన్న విషయాన్ని పరిశీలించి,
ఆ మేరకు ఆ సంస్థపై తగిన చర్యలు తీసుకోవాలని కూడా సుప్రీంకోర్టు భారత
ప్రభుత్వాన్నీ, సెబీనీ ఆదేశించింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై
చంద్రచూడ్ తన తీర్పులో ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ –
ఓసీసీఆర్పీ గురించి ప్రస్తావిస్తూ ‘‘ఓసీసీఆర్పీ నివేదిక విశ్వసనీయతను
తిరస్కరించాం. ఒక థర్డ్ పార్టీ సంస్థ ఇచ్చిన నివేదికను ఎలాంటి తనిఖీ చేయకుండా దాన్ని
విశ్వసించడాన్ని ఆధారంగా పరిగణించలేము. ఈ
కేసులో దర్యాప్తును సెబి నుంచి వేరే సంస్థకు బదిలీ చేయవలసిన ఏ అవసరమూ లేదు’’ అని
స్పష్టం చేసారు.
అదానీ గ్రూపే లక్ష్యంగా చేసిన హిండెన్‌బర్గ్
ఆరోపణలు, రూపొందించిన ఓసీసీఆర్పీ నివేదికలు సత్యవచనాలు అని భావించలేమంటూ
సుప్రీంకోర్టు నవంబర్ 24నాడే న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌కు స్పష్టం చేసింది. తాజా
తీర్పు దాన్నే ప్రతిఫలిస్తోంది.
‘‘ప్రభుత్వ సాధికార నియంత్రణా సంస్థ సెబిని
ప్రశ్నించడానికి కొన్ని వార్తాపత్రికల
కథనాలు, థర్డ్ ఫార్టీ సంస్థలపై ఆధారపడడం సరి కాదు. అవి కేవలం సమాచారం మాత్రమే తప్ప
సెబి దర్యాప్తును అనుమానించడానికి నిర్ణయాత్మక ఆధారాలు కాబోవు. …
ప్రజాహితవ్యాజ్యం అనేది సాధారణ పౌరులకు న్యాయపరమైన అవకాశం కల్పించే ఒక సౌకర్యం
మాత్రమే. తగినంత పరిశోధనా, సరైన ఆధారాలూ లేని నివేదికల ఆధారంగా దాఖలు చేసే
పిటిషన్లను ఆమోదించడం సాధ్యం కాదు’’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఈ విషయంలో పిటిషన్ దాఖలు చేసినవారు
న్యాయవాదులు విశాల్ తివారీ, ఎంఎల్ శర్మ, కాంగ్రెస్ నాయకురాలు జయా ఠాకూర్, సామాజిక
కార్యకర్త అనామికా జైస్వాల్. అదానీ గ్రూపు తమ షేర్ల విలువను బాగా ఎక్కువ చేసి
చూపించి మోసం చేసిందని వారి పిటిషన్ల సారాంశం. షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్
రిసెర్చ్ గతేడాది జనవరి 24న విడుదల చేసిన నివేదిక కారణంగా అదానీ గ్రూపు సంస్థల్లో
కొన్నింటి షేర్ విలువలు దారుణంగా పతనమయ్యాయి.
‘‘ఎంపిక చేసిన తప్పుడు సమాచారం,
దాచిపెట్టిన సత్యాలు, ఊరూపేరూ లేని ఆరోపణల దురుద్దేశపూర్వక కలయికే హిండెన్‌బర్గ్
నివేదిక. దాని లక్ష్యం అదానీ గ్రూపును దెబ్బతీయడమే’’ అంటూ ఆ నివేదికను అదానీ
గ్రూప్ దుయ్యబట్టింది.
ఈ కేసులో దర్యాప్తును సెబి నుంచి సిట్‌కు
దర్యాప్తు చేయాలని పిటిషనర్లు కోరారు. అయితే అసాధారణమైన పరిస్థితుల్లో మాత్రమే
కేసు దర్యాప్తును ఒక సంస్థ నుంచి మరో సంస్థకు బదిలీ చేయడం జరుగుతుందనీ… ఏ బలమైన,
తర్కబద్ధమైన కారణం లేకుండా అలాంటి అధికారాన్ని ఉపయోగించబోమనీ సుప్రీంకోర్టు
వివరించింది. ఆ కారణం వల్లనే సెబి దర్యాప్తు బదిలీ విజ్ఞప్తిని త్రోసిపుచ్చినట్లు
స్పష్టం చేసింది.
ఈ కేసు విచారణ కోసం సుప్రీంకోర్టు నియమించిన
కమిటీ… ‘ఈ కేసులో సెబి నియంత్రణలో
వైఫల్యం లేదనీ, అదానీ గ్రూప్ ఎలాంటి ధరల మార్పిడికీ పాల్పడలేద’నీ స్పష్టం చేసింది.
ఆ ఆర్థిక సామ్రాజ్యంలోని రిటెయిల్ పెట్టుబడిదారులకు ఊరట కలిగించేలా అదానీ గ్రూపు
అన్ని తగిన చర్యలూ తీసుకుందని వ్యాఖ్యానించింది. హిండెన్‌బర్గ్ నివేదిక
ప్రచురించిన తర్వాత దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అన్ని
చర్యలూ తీసుకుందని స్పష్టం సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.
అదానీ గ్రూప్ హిండెన్‌బర్గ్
రిసెర్చ్ నివేదిక గురించి ఒక ప్రకటనలో ఇలా
చెప్పింది. ‘‘ఇదేదో ఒక కంపెనీ మీద చేసిన అసందర్భ దాడి కాదు. భారతదేశపు
స్వతంత్రాన్ని, సమగ్రతను, భారతీయ వ్యవస్థల నాణ్యతను…. ఇలా అన్నింటినీ పరిగణనలోకి
తీసుకుని ఉద్దేశపూర్వకంగా చేసిన దాడి. భారతదేశపు అభివృద్ధిపైనా, ఆశయాలపైనా దాడి
చేయడమే వారి లక్ష్యం’’ అంటూ హిండెన్‌బర్గ్ నివేదికపై మండిపడింది.