Japan Planes Accident, Five dead, one flight
burnt
జపాన్‌లో (Japan) రెండు విమానాలు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మరణించారు. కోస్ట్‌గార్డ్
ఎయిర్‌క్రాఫ్ట్‌లోని (Coastguard Aircraft) ఐదుగురు సిబ్బందీ ప్రాణాలు కోల్పోయారు (Five crew died). మంటలు అంటుకుని తగలబడిపోయిన ప్యాసింజర్ విమానంలోని (Passenger Aeroplane) 379 మంది ప్రయాణికులూ క్షేమంగా బైటపడ్డారు. ఈ దుర్ఘటన టోక్యోలోని హనేడా
విమానాశ్రయంలో (Haneda Airport) మంగళవారం నాడు చోటు
చేసుకుంది.
జపాన్ రవాణా మంత్రి టెట్సువో
సయీటో చెప్పిన వివరాల ప్రకారం…. సోమవారం భూకంపం వచ్చిన సెంట్రల్ జపాన్‌కు వెళ్ళడానికి కోస్ట్‌గార్డ్ విమానం బయలుదేరుతోంది.
అందులో ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఆ విమానం అదే విమానాశ్రయంలో ఉన్న మరొక
ప్యాసింజర్ విమానాన్ని ప్రమాదవశాత్తు గుద్దేసింది. దాంతో కోస్ట్‌గార్డ్ విమానంలో
ఉన్న సిబ్బందిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం కారణంగా ప్యాసింజర్
విమానంలో మంటలు అంటుకున్నాయి. ఆ సమయానికి ఆ విమానంలో 367మంది ప్రయాణికులు, 12మంది సిబ్బంది
అంతా కలిపి 379మంది ఉన్నారు. ప్రయాణికుల్లో 8మంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు. వారందరినీ
సురక్షితంగా బైటకు తీసుకురాగలిగారు. విమానం మాత్రం మంటల్లో పూర్తిగా కాలి
బూడిదైపోయింది.
కోస్ట్‌గార్డ్ విమానంలోని
కెప్టెన్, గాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలిగాడు. ప్రమాదానికి కారణం
ఏమిటన్నది ఇప్పుడే చెప్పలేమని అతను వెల్లడించాడు.
జపాన్ ఎయిర్‌లైన్స్‌కు
చెందిన ఎయిర్‌లైనర్ విమానం ప్రమాదానికి గురయింది. విమానం వెనుకభాగంలో మంటలు
అంటుకుని ముందుకు వ్యాపించాయి. దాంతో విమానంలోని ప్రయాణికులను ముందువైపు పక్కభాగం
నుంచి జాగ్రత్తగా కిందకు దింపారు. వారందరూ సురక్షితంగా దిగగలిగారు.
అంతలోనే డజన్ల కొద్దీ
ఫైరింజన్లు విమానాశ్రయానికి చేరుకున్నాయి. మంటలు ఆర్పడానికి విశ్వప్రయత్నం చేసాయి.
కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. విమానం రెక్కల దగ్గర నుంచి వస్తున్న మంటలను
ఆర్పలేకపోయారు. అవి వేగంగా విమానమంతా వ్యాపించి, మొత్తం విమానాన్ని తగలబెట్టేసాయి.
జపాన్ ఎయిర్‌లైన్స్‌కు
చెందిన ఎయిర్‌బస్ 350, న్యూ చిటోస్ ఎయిర్పోర్ట్ నుంచి అప్పుడే హనేడా వచ్చి,
ల్యాండ్ అయింది. ఇక ప్రమాదానికి కారణమైన కోస్ట్‌గార్డ్ విమానం ఇషికావా వెళ్ళడానికి
సిద్ధమవుతోంది. ఇషికావాలో జనవరి 1న సంభవించిన భూకంపం కారణంగా కనీసం 48మంది
చనిపోయారు. అక్కడ సహాయకచర్యల కోసం ఈ కోస్ట్‌గార్డ్ విమానం వెళ్ళడానికి టేకాఫ్
తీసుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది.
జపాన్ ప్రధానమంత్రి ఫ్యుమియో
కిషిడా, మృత సిబ్బందికి నివాళులర్పించారు. భూకంప బాధితులకు సేవలందించడానికి వెడుతూ
ప్రాణాలు కోల్పోయిన వారి సేవానిరతిని ప్రశంసించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
ప్రకటించారు.
ఈ ఘటన తర్వాత హనేడా
విమానాశ్రయం నుంచి దేశీయ విమానాల రాకపోకలను నిలిపివేసారు. అంతర్జాతీయ విమానాలు
మాత్రం యధావిధిగా ప్రయాణిస్తున్నాయి.
జపాన్‌లో 1985లో జరిగిన
భారీ విమాన ప్రమాదం తర్వాత మళ్ళీ ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి. అప్పుడు టోక్యో
నుంచి ఒసాకా వెడుతున్న విమానం సెంట్రల్ గున్మా ప్రాంతంలో కూలిపోయింది. ఆ
విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది 520మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచంలోని
భయంకరమైన విమాన ప్రమాదాల్లో అదొకటి. దాని తర్వాత ఇన్నేళ్ళూ జపాన్‌లో విమాన ప్రమాదం
అన్నదే జరగలేదు.