Story of Kashmiri Hindu
Police killed by JKLF
2 జనవరి 1991నాటి రాత్రి జమ్మూకశ్మీర్‌లో
పోలీస్ అధికారిగా పనిచేస్తున్న, కశ్మీరీ పండిట్ కుటుంబానికి చెందిన ఓంకార్‌నాథ్ (ASI Omkar Nath) మాయమైపోయాడు. అతని కోసం అతని కుటుంబ సభ్యులు నేటికీ ఎదురుచూస్తూనే
ఉన్నారు. వారితో సహా అందరికీ తెలిసిన, ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించలేని విషయం
ఒకటే… అతను హత్య చేయబడ్డాడు.
ఏఎస్ఐ ఓంకార్‌నాథ్ అదృశ్యం వెనుక ఉన్న
దుష్టశక్తి పేరు జేకేఎల్ఎఫ్ (JKLF). పూర్తిపేరు జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్. పాకిస్తానీ ఉగ్రవాద సంస్థ
అయిన జేకేఎల్ఎఫ్ లక్ష్యం కశ్మీర్‌ను భారత్ నుంచి విడదీయడం. దానికి వారెంచుకున్న
మార్గం హింస. అపరిమితమైన, అనూహ్యమైన, బీభత్స భయానకమైన హింస.
కశ్మీరీ పండితుల పేరు ఎత్తగానే వారు
అనుభవించిన దుర్భరమైన హింసాకాండ గుర్తొస్తుంది. కశ్మీర్లో హిందువులపై దౌర్జన్యాలు
మొదలయింది 1989కంటె ముందే. కానీ 1989 సెప్టెంబర్ 14న టీకాలాల్ టప్లూ హత్య (Tikalal Taplu Murder) తర్వాత ఆ అత్యాచారాలకు అంతే లేకుండా పోయింది. కశ్మీరీ వేర్పాటువాదుల
క్రూరత్వానికి కారణం ఒక్కటే… జమ్మూకశ్మీర్‌లోని హిందువులను ఊచకోత కోయడం, వారిని
అక్కడినుంచి తరిమికొట్టడం. ఆ సమయంలో కశ్మీరీ పండితులకు నేతగా ఉన్నవారు టీకాలాల్
టప్లూ. ఆయనను జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ ఉగ్రవాదులు శ్రీనగర్‌లో కాల్చి చంపి
పడేసారు. అలా, కశ్మీరీ పండితుల్లో జేకేఎల్ఎఫ్ పేరు వింటే చాలు వణుకు పుట్టేలా చేసారు.
టీకాలాల్ టప్లూ హత్య జరిగిన ఏడాది తర్వాత
లక్షలాది హిందువులు కశ్మీర్ లోయ నుంచి బైటపడ్డారు. స్థానిక ముస్లిముల అండదండలతో జేకేఎల్ఎఫ్
ఉగ్రవాదుల అత్యాచారాలు నానాటికీ పెచ్చుమీరిపోయాయి. ఆ హింసను భరించలేని హిందువులు తమ
కుటుంబాలను తీసుకుని ఎక్కడివారు అక్కడినుంచి కట్టుబట్టలతో కశ్మీర్ లోయనుంచి పారిపోవడం
మొదలుపెట్టారు. లక్షలమంది హిందువులు తమ పూర్వీకుల భూమిని వదిలిపెట్టి
కాందిశీకులుగా మారిపోయారు.
అప్పుడు జమ్మూకశ్మీర్‌లో అధికారంలో ఉన్నది
ఫారూఖ్ అబ్దుల్లా (Farooq Abdullah)
ప్రభుత్వం. కశ్మీరీ పండితులు రాష్ట్రం
వదిలిపెట్టి పారిపోతుంటే ఫారూఖ్ అబ్దుల్లా సర్కారు అచేతనంగా ఉండిపోయింది.
నిజానికి, వేర్పాటువాద ఉగ్రవాదులకు సాయం చేయడం కోసమే అబ్దుల్లా ప్రభుత్వం నిశ్చేష్టంగా
ఉండిపోయిందన్నది బైటకు చెప్పని వాస్తవం. అప్పట్లో జేకేఎల్ఎఫ్, పాకిస్తాన్
ప్రోద్బలంతో పనిచేస్తున్న ఇతర ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు కలిసి కశ్మీర్లో తమ
ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నాయి. దాంతో తన అధికారాన్ని
కాపాడుకోడానికి ఫారూఖ్ అబ్దుల్లా, ఉగ్రవాదుల అరాచకాలను చూసీ చూడనట్టు వదిలేసాడు.
అలాంటి పరిస్థితుల్లో సైతం, అనంతనాగ్
పోలీస్ విభాగంలో ఏఎస్ఐగా పనిచేస్తున్న ఓంకార్‌నాథ్ వంటి హిందువులు ఉగ్రవాదుల ముందు
తలవంచడానికి నిరాకరించారు. ఉగ్రవాద సంస్థలు ఓంకార్‌నాథ్ ప్రాణాలు తీయడానికి
పలుమార్లు ప్రయత్నించారు. ఆ దాడుల నుంచి చాలాసార్లు తప్పించుకున్న ఓంకార్‌నాథ్ తన
కుటుంబాన్ని అయినా సురక్షితంగా ఉంచాలనుకుని వారిని జమ్మూకు తరలించాడు.
అయితే ఓంకార్‌నాథ్ సహచరుడే ఒక
దుర్మార్గుడు అతని రాకపోకల వివరాలను జేకేఎల్ఎఫ్ ఉగ్రవాదులకు అందజేసాడు. ఆ తర్వాత
ఏం జరుగుతుంది? ఓంకార్‌నాథ్ ముందునుంచీ అనుమానిస్తున్నదే జరిగింది. 1991 జనవరి 2న
జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ ఉగ్రవాదులు ఓంకార్‌నాథ్‌ను కిడ్నాప్ చేసారు. ఆ విషయం
తెలిసినా, పోలీసులు మిన్నకుండిపోయారు. తమ సహచరుడి గురించి కనీసం వెతకలేదు. ఓంకార్‌నాథ్
కథ అక్కడే ముగిసిపోయింది. ఎందుకంటే ఆ తర్వాత అతని గురించి ఏమీ తెలియలేదు. కనీసం అతని
శవమైనా దొరకలేదు. అతని హంతకుల మీద ఎలాంటి కేసూ నమోదవలేదు. ఓంకార్‌నాథ్ మాయం
వ్యవహారం ఒక పజిల్‌లాగే ఉండిపోయింది.
ఓంకార్నాథ్కు భార్య, కుమారుడు, ఇద్దరు
కుమార్తెలు ఉన్నారు. వారు ఇప్పటికీ తమకు జరగాల్సిన న్యాయం గురించి ఎదురుచూస్తూనే
ఉన్నారు.