తమ డిమాండ్ల సాధన కోసం 22 రోజులుగా నిరసన తెలుపుతోన్న అంగన్వాడీలపై (anganvari workers strike) ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. జనవరి 5లోగా విధులకు హాజరు కావాలని స్పష్టం చేసింది. 5వ తేదీలోగా విధులకు హాజరు కాకుంటే, చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. వివిధ జిల్లాల కలెక్టర్లు ఇందుకు సంబంధించిన హెచ్చరిక నోటీసులను అంగన్వాడీలకు జారీ చేశారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు కలెక్టర్లు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
కనీస వేతనం నెలకు రూ.26 వేలు చెల్లించాలని, గ్రాట్యుటీ ఇవ్వాలంటూ 11 డిమాండ్లతో అంగన్వాడీలు నిరసన చేపట్టారు. గడచిన 22 రోజులుగా విధులు బహిష్కరించి అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వంతో పలు దఫాలుగా జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. పది డిమాండ్లు పరిష్కరించినట్లు ప్రభుత్వం చెబుతున్నా, ప్రధాన డిమాండైన జీతాల విషయంలో మాత్రం ఎలాంటి ముందడుగు పడలేదు. దీంతో అంగన్వాడీలు సమ్మెను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు.