భారత న్యాయ సంహిత చట్టం ట్రక్ డ్రైవర్లను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఈ చట్టంలో హిట్ అండ్ రన్ కేసులకు తీవ్రమైన శిక్షలు ఖరారు చేశారు. ఎవరైనా వాహన డ్రైవర్లు (truck drivers strike) ప్రమాదం చేసి, పారిపోతే అలాంటి వారికి 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ.7 లక్షల వరకు జరిమానా పడనుంది. కొత్త చట్టంలో మార్పులు కోరుతూ లారీ డ్రైవర్లు నిరసనకు దిగారు. దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ట్యాంకర్ల డ్రైవర్లు కూడా ఈ ఆందోళనలో పాల్గొనడంతో వినియోగదారులు బంకులకు ఎగబడ్డారు.
నాగపూర్‌లో సోమవారం అర్థరాత్రి నుంచే వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరారు. మధ్యప్రదేశ్, జమ్ముకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, లద్దాఖ్ ప్రాంతంలోనూ బంకుల వద్ద జనం బారులు తీరారు. కొన్ని ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర బారులు తీరారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో జనం మరింతగా బంకులకు పరుగులు తీస్తున్నారు. లారీ డ్రైవర్ల నిరసనలతో కొన్ని ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ల రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇంధన కొరత రాకుండా కేంద్ర, రాష్ట్రాలు పలు చర్యలు చేపడుతున్నాయి.