మధుమేహం గుర్తించేందుకు రక్తం శాంపిల్ తీయాల్సి ఉంటుంది. కొందరికి మూడు నెలలకు, ఆరు నెలలకు ఒకసారి రక్తం శాంపిల్ తీసుకుని పరీక్షిస్తే సరిపోతుంది. కానీ టైప్ 1 మధుమేహులకు (sugar test instrument) మాత్రం రోజుకు నాలుగు సార్లు పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా ఇన్సులిన్ ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా 18 సంవత్సరాలలోపు పిల్లలు ఈ టైప్ 1 షుగర్ భారిన పడుతున్నారు. ఇలాంటి వారికి సాయపడాలని పూసా చిరంజీవి శ్రీనివాసరావు చేసిన ప్రయోగాలు ఫలించాయి.
ఏలూరు సమీపంలోని ఉంగుటూరుకు చెందిన శ్రీనివాసరావు, ఐఐటీ కాన్పూర్లో కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో శాస్త్రవేత్తగా చేస్తున్నారు. 18 సంవత్సరాలలోపు పిల్లలు టైప్ 1 మధుమేహానికి గురవుతున్నారు. అలాంటి వారికి ఉపయోగపడేలా శ్రీనివాసరావు ఎలక్ట్రోకెమికల్ పరికరాన్ని అభివృద్ధి చేశారు. నాలుగేళ్లు శ్రమించి ఈ పరికరాన్ని తీసుకువచ్చారు. ఇండియన్ పేటెంట్ అధారిటీ రెండేళ్లపాటు అన్ని విధాలా పరీక్షించింది. గత నెల 29న హక్కులు నిర్థారిస్తూ ధ్రువపత్రం జారీ చేసింది.