భారీ భూకంపం జపాన్ను కుదిపేసింది. సోమవారం సంభవించిన వరుస కంపనాలతో అనేక భవనాలు నేలకొరిగాయి. భూకంపం ఘటనలో 13 మంది చనిపోయారని,వందల మంది ఆచూకీ లభించాల్సి ఉందని అధికారులు ప్రకటించారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తీర ప్రాంత రాష్ట్రం ఇషికావాలో తీవ్ర నష్టం వాటిల్లినట్లు వార్తలు వస్తున్నాయి. పెను భూకంపం (janapn earth quake tsunami alert) తరవాత భారీ సునామీ రోబోతోందంటూ జపాన్ వాతావరణ శాఖ జారీ చేసి హెచ్చరికల తీవ్రతను తగ్గించుకుంది.మరోసారి భూమి కంపించే అవకాశాలు లేకపోలేదని అనుమానిస్తున్నారు. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.
తీర ప్రాంత రాష్ట్రం ఇషికావాలో సునామీ అలలను గుర్తించారు. వాజిమాలో అలలు 1.2 మీటర్ల మేర ఎగసిపడ్డాయి. దీంతో సమీప ప్రాంత ప్రజలు పరుగులు తీశారు. ఇషికావాలో 50 ఇళ్లు ధ్వంసం అయ్యాయి. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. వాజిమా నగరంలో ఓ భవనంలో మంటలు ఎగసిపడ్డాయి. 50 దుకాణాలు కాలిపోయాయని అగ్నిమాపక అధికారులు వెల్లడించారు.
ఇషికావా సమీపంలో సోమవారం వచ్చిన భారీ భూకంపం రిక్టర్ స్కేలుపై 7.5గా నమోదైంది. దీని తరవాత 100 సార్లు భూమి కంపించిందని జపాన్ ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. భూకంపం తరవాత ఏదో కాలుతున్న వాసన వస్తోందని న్యూక్లియర్ రెగ్యులేటర్ అథారిటీ వెల్లడించింది. భూకంపం తరవాత అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రెండు అణు రియాక్టర్లు సరిగా పనిచేయడం లేదని గుర్తించారు. భూకంప ప్రభావం దక్షిణ కొరియాను కూడా తాకింది. అయితే ఎలాంటి నష్టం వాటిల్లినట్లు తెలియరాలేదు.