భారీ భూకంపం జపాన్ ప్రజలను పరుగులు పెట్టించింది. తాజాగా వచ్చిన భూకంపం రిక్టర్ స్కేలుపై 7.6గా నమోదైంది. ఇప్పటికే జపాన్ వాతావరణ శాఖ సునామీ హెచ్చరికలు (japan earith quake tsunami alert) జారీ చేసింది. జపాన్ రాజధాని టోక్యోలోని భారత రాయబార కార్యాలయం అత్యవసర పరిస్థితులను పర్యవేక్షించేందుకు ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేసింది. ప్రత్యేక ఫోన్ నెంబర్లు ఏర్పాటు చేశారు. మెయిల్ ద్వారా కూడా సహాయం కోరవచ్చు. భూకంపం, సునామీ సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. స్థానిక ప్రభుత్వాల సూచనలు పాటించాలని భారతీయులకు రాయబార కార్యాలయం సూచించింది.
సోమవారం సాయంత్రం కూడా భూ ప్రకంపనలు జపాన్ను కలవరపెట్టాయి. 21 సార్లు భూమి కంపించింది. ఇషికావా ద్వీపకల్పంలో సునామీ అలలను కూడా గుర్తించారు. 1.2 మీటర్ల ఎత్తులో సునామీ వచ్చినట్లు గుర్తించారు. వాజిమాలాలో వీధులు, భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రహదారులు చీలిపోయాయి. భవనాలు నెర్రలిచ్చాయి. సునామీ అత్యధికంగా 5 మీటర్ల ఎత్తులో రావచ్చని జపాన్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.